- విచారణ టైంలోనే ఒకరు మృతి
- ఏడుపులతో దద్దరిల్లిన భువనగిరి జిల్లా కోర్టు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా దిలావర్పూర్లో జరిగిన హత్య కేసులో 14 మందికి జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. జిల్లాలోని మోటకొండూరు మండలం దిలావర్పూర్లో సీస యాదగిరి (85) మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో 2018 ఆగస్టు 11న ఆదే గ్రామానికి చెందిన బుర్రి రాజేశ్, మరికొందరు కర్రలతో కొట్టి చంపారు. దీంతో మృతుడి కొడుకు గోవర్ధన్ 15 మంది తన తండ్రిని కొట్టి చంపారని కేసు పెట్టాడు. పోలీసులు 2019 ఫిబ్రవరిన భువనగిరి జిల్లా కోర్టులో బుర్రి రాజేశ్‌ను ఏ1గా పేర్కొంటూ 15 మంది పేర్లతో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల వాంగ్మూలం, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇద్దరు మహిళలతో సహా15 మందిని దోషులుగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. అలాగే రూ. వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఏ14 కావిటి కరుణాకర్ చనిపోయాడు. మిగిలిన 14 మందిని భువనగిరి ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి చర్లపల్లి జైలుకు తరలించారు.
మిన్నంటిన బంధువుల రోదనలు
ఆరేండ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసుపై తీర్పు వెలువడుతుందన్న విషయం తెలుసుకున్న దిలావర్పూర్ వాసులు,14 మంది నిందితుల కుటుంబసభ్యులు భువనగిరిలోని కోర్టుకు తరలివచ్చారు. జీవిత ఖైదు పడిందని తెలిసిన తర్వాత పెద్దపెట్టున రోదించారు. శిక్ష పడిన వారిలో ఆరుగురు మినహా మిగిలిన వారందరూ 20 నుంచి 40 ఏండ్లలోపు వారే. దీంతో చిన్న పిల్లలతో ఎలా బతకాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఓ యువతి ఏడుస్తూనే స్పృహతప్పి పడిపోయింది.