హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు .. 15 మంది మృతి

హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు .. 15 మంది మృతి
  • మరో 27 మందికి గాయాలు
  • ఇప్పటిదాకా 2,255కు చేరిన మృతుల సంఖ్య

బీరుట్: లెబనాన్​లోని ఉత్తర బీరుట్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 15 మంది చనిపోయారు. 27 మంది గాయపడ్డారు. మూడు గ్రామాలపై ఇజ్రాయెల్  బలగాలు శనివారం ఈ దాడి చేశాయి. షియా ముస్లిం మెజారిటీ గ్రామం మాయ్ స్రాలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ‘‘ఇజ్రాయెల్  దాడిలో లెబనాన్  పౌరులు చనిపోవడంతో పాటు బిల్డింగులు కూడా నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టి అతికష్టమ్మీద వారిని బయటకు తీశాం. 

బాధితులను ఆసుపత్రికి తరలించాం. అలాగే రాజధాని బీరుట్ కు దక్షిణాన ఉన్న షౌఫ్ జిల్లాలోని బాజ్రా గ్రామంపైనా ఇజ్రాయెల్  దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 18 మంది గాయపడ్డారు. ఇక బాత్రౌన్  గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న డీర్  బిల్లా గ్రామంపైనా దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు చేయిస్తున్నాం” అని అధికారులు వెల్లడించారు. కాగా.. డీర్  బిల్లాలోని ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్  దాడి చేసిందని అధికారిక నేషనల్  న్యూస్  ఏజెన్సీ (ఎన్ఎన్ఏ) తెలిపింది. దక్షిణ లెబనాన్ కు చెందిన కొన్ని కుటుంబాలు ఆ ఇంట్లో తలదాచుకున్నాయని ఎన్ఎన్ఏ పేర్కొంది. 

ఇజ్రాయెల్  దాడిలో ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని వెల్లడించింది. అలాగే తూర్పు లెబనాన్ లోని జహ్లేలో తాల్ చిహా ఆసుపత్రిపైనా ఇజ్రాయెల్  బలగాలు దాడి చేశాయని ఆసుపత్రి మేనేజ్ మెంట్ పేర్కొంది. ఈ దాడిలో హాస్పిటల్  స్టాఫ్, పేషెంట్లకు గాయాలు అయ్యాయని, ఆసుపత్రి భవనం కొంతమేర ధ్వంసమైందని చెప్పింది. దాడి జరిగిన మూడు గ్రామాలు కూడా హెజ్బొల్లాకు మంచి పట్టున్న స్థావరాలు అని అధికారులు చెప్పారు. ఈ నెల 11న కూడా ఇజ్రాయెల్ దాడిలో 26 మంది చనిపోయారని, ఇప్పటి వరకూ ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 2,255కు చేరిందని తెలిపారు.

సెంట్రల్  గాజాలో 8 మంది మృతి..

సెంట్రల్  గాజాపై శనివారం రాత్రి ఇజ్రాయెల్  చేసిన దాడిలో 8 మంది చనిపోయారని పాలస్తీనా అధికారులు ఆదివారం తెలిపారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందని వారని చెప్పారు. నసీరత్  శరణార్థి శిబిరంపై ఈ అటాక్  జరిగిందని, మృతుల్లో ఇద్దరు తల్లిదండ్రులు, ఆరుగురు పిల్లలు ఉన్నారని వెల్లడించారు. పిల్లలంతా 8 నుంచి 23 ఏండ్ల మధ్యలో ఉన్నవారని పేర్కొన్నారు.