సైనిక విమానం కుప్పకూలి.. 15మంది మృతి

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన సైనిక విమానం కుప్పకూలి..15మంది మృతి చెందారు. ఈ  ప్రమాదానికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్యాకు చెందిన మిలటరీ కార్గో విమానం ఇంజన్‌లలోని ఒకదానిలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవానోనో ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగిందని  తెలిపింది.  మరణించిన వారిలో ఎనిమిది మంది సిబ్బందితోపాటు ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వెస్ట్ రష్యాలోని ఎయిర్ బేస్ నుంచి 15మందితో  టేకాఫ్ అయిన కొద్ది సమయంలో ఐఎల్ 76 మిలిటరీ  విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. కాగా, ఈ ఏడాదిలో ఐఎల్-76 విమానం ప్రమాదానికి గురికావడం ఇది రెండోది. జనవరి 24, 2024న, 65 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలతో సహా 74 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని ఉక్రేనియన్ సాయుధ దళాలు కూల్చివేశాయి.