- స్క్రాపేజ్ పాలసీ తెచ్చిన కేంద్రం
- ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో రాయితీలు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో తమ పాత వాహనాలను తుక్కుగా మార్చి కొత్త వాటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం, పాత వాటిని తుక్కుగా మార్చిన తర్వాత కొత్త వ్యక్తిగత వాహనాన్ని కొనుగోలు చేసే కస్టమర్లు వాహన ధరలో లేదా రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీని పొందవచ్చు. వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ ఉంటుంది.
ఇది వరకే బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, కేరళ రాష్ట్రాలు రాయితీలు ప్రకటించాయి. ఫిట్‌నెస్ లేని వాహనాలను దశలవారీగా తొలగించడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ స్క్రాపేజ్ విధానం తెచ్చారు. "ఇటీవలి నివేదిక ప్రకారం, భారతీయ రోడ్లపై 5 కోట్ల ప్రైవేట్ లైట్ మోటారు వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ గత 15 సంవత్సరాలుగా రోడ్లపైన తిరుగుతున్నాయి. ఫలితంగా గణనీయమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. భారతీయ రోడ్లపై తిరిగే ఇతర వాహనాలకు ప్రమాదం కూడా" అని పార్క్ ప్లస్ సీఈఓ అమిత్ లఖితా చెప్పారు. వీళ్లు పాత వాహనాల వ్యాపారం చేస్తారు. బలమైన స్క్రాపింగ్ విధానం, భారతీయ ఆటో పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు..
వివిధ రాష్ట్రాల్లో రాయితీలు ఇలా...
1. మనదేశంలో12 రాష్ట్రాలు పాత వాహనాన్ని తుక్కుగా మార్చిన తర్వాత కొత్త ప్రైవేట్ వాహనాన్ని రిజిస్టర్ చేసుకునేటప్పుడు రోడ్డు పన్నులో 25 శాతం రాయితీని అందిస్తున్నాయి.
2. కొత్త ప్రైవేట్ వాహనం ధర ఆధారంగా కర్ణాటక రోడ్డు పన్నులో స్థిరమైన రాయితీని అందిస్తోంది - ఉదాహరణకు, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు రూ. 50 వేల రాయితీ ఉంటుంది.
3.ఉత్తరాఖండ్ ప్రైవేట్ వాహనాలకు 25 శాతం రాయితీ లేదా రూ.50 వేలు.. ఏది తక్కువైతే అది అందిస్తోంది. పుదుచ్చేరి ప్రైవేట్ వాహనాలకు 25 శాతం రాయితీ లేదా రూ.11వేలు..వీటిలో ఏది తక్కువైతే అది అందిస్తోంది.
4. హర్యానా ప్రైవేట్ వాహనాలకు 10 శాతం రాయితీ లేదా స్క్రాప్ విలువలో 50 శాతం కంటే తక్కువ.. వీటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని అందిస్తోంది.
వాహనం స్క్రాపేజ్ విధానం అంటే ఏమిటి ?
ఈ విధానం ప్రకారం 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన ప్రయాణీకుల వాహనాలు ఇక నుంచి నడవచ్చో లేదో తెలుసుకోవడానికి ఫిట్‌నెస్, ఉద్గార పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. వాహనాల స్క్రాపింగ్ నిబంధనలు అమలు చేస్తారు. 2024 నిబంధనల ప్రకారం, మోటార్ సైకిల్ జీవితకాలం ఏడేళ్లు లేదా 1,20,000 కిలోమీటర్ల దూరం. వీటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. ఎల్సీవీలు ఆరున్నర సంవత్సరాలు లేదా 1,50,000 కి.మీ తరువాత టెస్టులు చేయించుకోవాలి. భారీ వాణిజ్య వాహనాలు 10 సంవత్సరాలు లేదా 4,00,000 కిలోమీటర్ల తరువాత టెస్టులకు వెళ్లాలి.
.అన్ని ఇతర వాహనాలు గరిష్ట జీవితకాలం 15 సంవత్సరాల తర్వాత వాటిని తుక్కుగా మార్చుతారు. 2021లో వెహికల్ స్క్రాప్ పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుంచి దాదాపు 70 వేల పాత వాహనాలు, చాలా వరకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందినవి స్వచ్ఛందంగా తుక్కుగా మార్చారు. ఢిల్లీలో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇటువంటి విధానం అక్కడ మాత్రమే ఉంది.