- త్వరలో టూరిజం కొత్త వెబ్సైట్:మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: పర్యాటక రంగం బలోపేతానికి టూరిజం డెవలప్మెంట్, బ్రాండింగ్, ప్రమోషన్ వంటి అంశాలపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక ప్రాంతాల గురించి విస్తృత ప్రచారం చేసేందుకు ఐటీ ఉద్యోగులు, యువత, వివిధ సంఘాలు, స్థానికుల సహకారం తీసుకోవాలని యోచిస్తున్నది.
ఈ క్రమంలోనే మంగళవారం హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్ లో ఐటీ ఉద్యోగులతో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐటీ ఉద్యోగులకు డిస్కౌంట్ కూపన్ ను లాంచ్ చేశారు. పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని వారిని కోరారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా మైండ్ స్పేస్ లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు హరిత హోటల్స్ లో 15 శాతం డిస్కౌంట్ అవకాశం కల్పిస్తున్నామని, దీన్ని మరిన్ని ఐటీ కంపెనీ ఉద్యోగులకు విస్తరిస్తామని ప్రకటించారు.
స్కాన్ కోడ్ లో రిజిస్టరైన ఐటీ ఉద్యోగులు ఈ డిస్కౌంట్ కూపన్ ను వినియోగించుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో చాలా టూరిజం ప్లేస్లు ఉన్నాయని.. వాటిని ప్రచారం చేసేందుకు తానే సేల్స్ మెన్ అవతారం ఎత్తి ఇక్కడకు వచ్చానన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో తెలంగాణ పర్యాటక ప్రాంతాలను ప్రదర్శించి.. విస్తృత ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే పర్యాటక శాఖ కొత్త వెబ్ సైట్ ను లాంచ్ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, రహేజా గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనే శ్రవణ్ కుమార్, హైదరాబాద్ సాప్ట్వేర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మెంబర్ బిపిన్ చంద్ర, ఐటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.