![సాంబార్లో గుగ్గిళ్లు.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత](https://static.v6velugu.com/uploads/2025/02/15-students-sick-in-tribal-welfare-boys-school-hostel_1w3LgqQDvB.jpg)
మహబూబాబాద్ /గూడూరు, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాల హాస్టల్లో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో జరిగింది. 360 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటుండగా.. గురువారం సాయంత్రం స్నాక్స్‌గా గుగ్గిళ్లు(గుడాలు) పెట్టారు. వీరిలో 15 మంది స్టూడెంట్స్ అప్పటికే నిల్వ ఉన్న సాంబార్‌ను పోసుకుని తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే హాస్టల్ ఏఎన్ఎం ట్రీట్ మెంట్ చేశారు.
శుక్రవారం ఉదయం నలుగురు విద్యార్థులు సాయి ప్రసాద్, అనిల్, రాహుల్, యాకూబ్ తీవ్ర అస్వస్థతకు గురికాగా.. వెంటనే గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు వార్డెన్ అప్పారావు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు చికిత్స పొందుతుండగా ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్మురళీ నాయక్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల కండీషన్ అడిగి తెలుసుకుని స్వయంగా హెల్త్ చెకప్ చేశారు. భయపడాల్సిన అవసరం లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఘటనపై కలెక్టర్ ఆదేశానుసారం గూడూరు ఎంపీడీవో వీరస్వామి హాస్టల్‌ను పరిశీలించారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ విద్యార్థులను పరామర్శించారు.