సిటీలో 53 చెరువు కట్టలకు డ్యామేజీ
ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లోని 185 చెరువులను పర్యవేక్షించేందుకు ఇంజనీర్లతో 15 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ చెప్పారు. బుధవారం జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం సీజన్ మొత్తం 80 సెం.మీ.ల వరకు హైదరాబాద్‌లో వర్షం కురవాల్సి ఉండగా వారం రోజుల్లోనే 70 సెం.మీ. వర్షం కురిసిందని పేర్కొన్నారు. దీంతో మొత్తం చెరువులు నిండాయన్నారు. అప్పా చెరువు, గుర్రం చెరువు, పల్లె చెరువు కట్టలు తెగాయని, 53 చెరువుల కట్టలు డ్యామేజీ అయ్యాయని వివరించారు. ఇంజనీర్ల టీమ్‌లు ఆయా చెరువులను పర్యవేక్షించి వెంటనే అవసరమైన రిపేర్లు చేపడుతాయని పేర్కొన్నారు. ఈ రిపేర్లకు జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌కు రూ.20 లక్షల వరకే మంజూరు చేసే అధికారం ఉండగా, దానిని రూ. 2 కోట్లకు పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకు పైగా చెరువులు ఉండగా, వాటిలో 121 చెరువుల కట్టలు తెగాయని, 25 కట్టలు డ్యామేజీ అయ్యాయన్నారు. వాటికి తాత్కాలిక రిపేర్ల కోసం రూ.10 కోట్లు, శాశ్వత రిపేర్ల కోసం రూ. 40 కోట్లు అవసరమని అంచనా వేశామని పేర్కొన్నారు.
‘కల్వకుర్తి’ ఘటనపై స్టడీ చేస్తున్నం
వైబ్రేషన్స్‌తోనే కల్వకుర్తి పంపుహౌస్ మునిగిందని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టం ఉండటం, ఎక్కువ వరదలు వస్తుండటంతోనే నీటి ఒత్తిడి సంభవించి ఉంటుందన్నారు. పాలమూరు పంపుహౌస్‌లో బ్లాస్టింగ్స్ కారణంగానే కల్వకుర్తి పంపుహౌస్ మునిగిందా అనే ప్రశ్నకు.. అది కారణం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై స్టడీ చేస్తున్నామన్నారు. పూర్తిగా నిండిన చెరువుల వద్దకు ఎవరూ వెళ్లొద్దని, అక్కడ సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు
చెరువుల ఆక్రమణలు నివారించేందుకు 2016లో డ్రాఫ్ట్ చేసిన లేక్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకువస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. రజత్ కుమార్ సమాధానం ఇవ్వలేదు. చెరువులు, నాలాల ఆక్రమణలపైనా నేరుగా సమాధానం ఇవ్వలేకపోయారు. ఇరిగేషన్ ఇన్వెంటరీ ద్వారా డిపార్ట్‌మెంట్‌కు ఉన్న ఆస్తుల వివరాలన్నీ సేకరించామని, అవన్నీ డిపార్ట్‌మెంట్ పేరిట మ్యుటేషన్ అవుతున్నాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో భూముల విలువలు పెరగడం, లీగల్ లిటిగేషన్స్ ఇతరత్రా కారణాలు ఉన్నాయని, ఆ వివరాలన్నీ సిద్ధంగా లేవని పేర్కొన్నారు. ‘గ్రేటర్‌లోని 185 చెరువులు నిండాయని చెప్తున్నారు.. మరి మియాపూర్‌లోని చెరువుల్లోకి చుక్కా నీళ్లు కూడా రాలేదు’ అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు. సంబంధిత ఇంజనీర్ స్పందిస్తూ.. ఆ చెరువుల్లోకి వరద రాకుండా మళ్లించడంతో మొత్తం 19 చెరువుల్లోకి నీళ్లు చేరలేదని చెప్పారు. చెరువులు, నాలాల కబ్జాలపై మాట్లాడేందుకు తాను ప్రెస్‌మీట్ పెట్టలేదని, వరదల సందర్భంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలను వివరించేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశానని రజత్‌కుమార్ చెప్పారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, కృష్ణా బేసిన్ సీఈ హమీద్ ఖాన్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
చెరువు కట్టలపై నజరేయండి
ఆఫీసర్లకు సీఎం కేసీఆర్ సూచన
భారీ వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు నిండాయని, అప్రమత్తంగా ఉండి కట్టలు తెగకుండా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇంజినీర్లు, సిబ్బందితో 15 స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేసి చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌తో సీఎం బుధవారం మాట్లాడారు. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండి కట్టలు బలహీనంగా ఉన్న చెరువులను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అటువంటి చెరువుల పరిధిలోని జనాన్ని ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
చెరువుల కబ్జాతోనే సిటీ మునుగుతోంది
ఇప్పుడైనా సర్కార్ చర్యలు చేపట్టాలి
పలు శాఖల ఆఫీసర్లకు హైకోర్టు నోటీసులు
‘‘గొలుసు కట్టు చెరువుల లింక్‌లు తెగ్గొట్టేశారు. రాత్రికి రాతి చెరువులు ఇండ్ల జాగాలైనయ్. ఇప్పుడు భారీ వానలకు హైదరాబాద్ లాంటి మహానగరమే మునుగుతోంది. చెరువుల కబ్జాలు అడ్డుకొని ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావు. ఇప్పటికైనా కండ్లు తెరవండి. రాష్ట్రంలోని చెరువుల కబ్జాలు తొలగించే చర్యలు తీసుకోండి. కఠినంగా ఉండాలి. కొరడా ఝుళిపించాలి. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఇప్పుడైనా కోఆర్డినేషన్‌తో పనిచేయాలి. అవసరమైతే పోలీసుల్ని వెంటబెట్టుకొని వెళ్లండి. చెరువుల రక్షణకు నడుంబిగించండి. చెరువులకు నీళ్లు ఇచ్చే క్యాచ్మెంట్ ఏరియాలు, కాలువలు, నాలాలు, కల్వర్టుల రక్షణకు చర్యలు చేపట్టాలి. వాటిపై ఆక్రమణల్ని చట్ట ప్రకారం తొలగించండి’’ అని రాష్ట్ర సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువుల కబ్జాపై సర్కార్ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని ఓ పత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు సుమోటోగా తీసుకుని బుధవారం విచారించింది. చెరువుల్లో ఆక్రమణల్ని తొలగించాల్సిందేనంటూ సీఎస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.
For More News..