టూరిజంలో వచ్చే ఐదేండ్లలో 15 వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి జూపల్లి కృష్ణారావు

టూరిజంలో వచ్చే ఐదేండ్లలో 15 వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని టూరిజం రంగంలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాబోయే ఐదేండ్లలో టూరిజంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. దాని వల్ల 3 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. పర్యాటకుల సంఖ్యలో టాప్ 5 రాష్ట్రాల జాబితాలో తెలంగాణను నిలుపుతామన్నారు. రాష్ట్ర జీడీపీలో టూరిజం వాటాను 10 శాతానికి పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. మరోవైపు మిషన్ మోడ్‎లో 9 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

మౌలిక వసతులను మెరుగుపరుస్తామన్నారు. మంగళవారం అసెంబ్లీలో టూరిజం పాలసీపై షార్ట్ డిస్కషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యాటక శాఖకు ఎంతో విలువైన స్థలాలున్నా అవి నిరర్థకంగా మారుతున్నాయని చెప్పారు. తారామతి బారాదరి కల్చరల్ సెంటర్ ఆస్తుల విలువ వందల కోట్లైనా.. ఏడాది ఆదాయం మాత్రం రూ.70 లక్షలు కూడా లేదన్నారు. హరిత హోటల్స్​తో లాభాలు రావడం లేదని, నష్టాలతో కొన్ని మూతపడ్డాయని చెప్పారు. 

అందుకే పీపీపీ మోడల్​లో పెట్టుబడులను ఆకర్శించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. శ్రీశైలం, సోమశిల, నాగార్జునసాగర్ వరకు 160 కిలోమీటర్ల మేర నల్లమల అడవులు, కృష్ణా తీరం, దట్టమైన అడవులు, జలపాతాలతో అందంగా ఉండే ప్రాంతాలను డెస్టినేషన్​ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కసరత్తులు చేస్తున్నామన్నారు.

వారసత్వాన్ని భావి తరాలకు అందిస్తం

ఘనమైన చారిత్రక వారసత్వం ఉన్న తెలంగాణలోనూ టూరిజంను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కృష్ణారావు చెప్పారు. తెలంగాణకు ప్రత్యేకమైన నిర్మాణ శైలులు, శిల్పాలు, ఆయుధాలు, ఆభరణాలు, భవనాలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచారవ్య వహారాలు, భాష, యాస, సాహిత్యం వంటివన్నీ మన సాంస్కృతిక వారసత్వంలో కీలకంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర పూర్వ వైభవాన్ని, వారసత్వాన్ని భావి తరాలకు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

 రాష్ట్ర పర్యాటక రంగంలో గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. గత పదేండ్లలో కొత్త టూరిజం పాలసీ అన్నదే లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్​గా తీర్చిదిద్దాలన్న ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్/కల్చర్ వంటి అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి పర్యాటకం పరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.