గొల్లపల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చందోలి గ్రామానికి చెందిన పెని సారయ్య భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో రెండు రోజుల కింద ఇంటికి తాళం వేసి వరంగల్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. శనివారం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోని 15తులాల బంగారు నగలు, రూ. 65వేలు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు.
ఘటనాస్థలికి చేరుకొని సీఐ రమణమూర్తి, ఎస్ఐ నరేశ్డాగ్ తనిఖీలు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చందుర్తి మండలంలో..
వేములవాడ, రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శనివారం ఉదయం తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 7 తులాల బంగారు నగలు, 13 తులాల వెండి గొలుసులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేశెట్టి రాజయ్య కుటుంబసభ్యులు శనివారం ఉదయం పొలం దగ్గరకు వెళ్లారు. 11 గంటలకు ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటనపై ఎస్ఐ అశోక్ గ్రామంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు. ఈ నెల 14న ఇదే మండలం గొస్కులపల్లిలో రెండిండ్లలో పట్టపగలే 8తులాల బంగారం, రూ.20వేలు, 400 డాలర్లు చోరీ అయ్యాయి. వరుస దొంగతనాలతో జనం భయాందోళనకు గురవుతున్నారు.