- యాదవ సామాజిక వర్గానికి చెందిన15 కుటుంబాల బహిష్కరణ
- ఫంక్షన్ కు వెళ్లి భోజనం చేసినందుకు
- రూ. 2 వేల చొప్పున ఫైన్
- వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారంలో ఘటన
నెక్కొండ, వెలుగు: యాదవ సామాజిక వర్గానికి చెందిన15 కుటుంబాలను కుల పెద్దలు బహిష్కరించిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన దారపు వెంకటేశ్ ఇంట్లో 9 నెలల కింద బంగారు నగలు పోయాయి. దీంతో తనను తిడుతున్నాడంటూ అదే సామాజిక వర్గానికి చెందిన ఇంటి ఎదురుగా ఉండే కుమ్మరి వెంకన్న కులపెద్దలకు ఫిర్యాదు చేశాడు. దీంతో కుల పంచాయితీ పెట్టి వెంకటేశ్‌ను పిలిచారు.
అక్కడికి వెళ్లిన అతను ఎందుకు పిలిచారంటూ కులపెద్దలపై కోపగించుకున్నాడు. దీంతో అతని కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు. అదే విధంగా గతేడాది జూలైలో ప్రభాకర్ కుమార్తె శారీ ఫంక్షన్ చేయగా తన కులస్తులను పిలిచాడు. 50 మంది వెళ్లగా అందులో15 మంది అన్నం తిన్నారు. దీంతో వారికి కుటుంబపెద్దలు రూ.2 వేల చొప్పున ఫైన్ చేశారు. ఆపై.. వెంకటేశ్ కుటుంబంతో పాటు మరో14 కుటుంబాలను కులం నుంచి వెలి వేసినట్టు బాధితులు తెలిపారు.
దీనిపై గత డిసెంబర్31న వరంగల్ సీపీ అంబర్ కిషోర్‌ఝా ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నెక్కొండ పోలీసులను సీపీ ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటివరకు సమస్యలను పరిష్కరిష్కరించలేదంటూ బాధిత కుటుంబాలు వాపోయాయి. అదే విధంగా గత శనివారం కులానికి చెందిన కుమ్మరి రాంమూర్తి చనిపోవడంతో అతని అంత్యక్రియలకు, సంతాప కార్యానికి 15 కుటుంబాలు వెళ్లవద్దంటూ కుల పెద్దలు అడ్డుకుని హుకుం జారీ చేశారు. దీంతో నెక్కొండ పోలీసులు మంగళవారం సాయంత్రం విచారణ చేపట్టారు.