తిరుమలలో మరో విషాదం: వెంగమాంబ అన్న సత్రం దగ్గర 15 ఏళ్ల పిల్లోడు మృతి

తిరుమలలో మరో విషాదం: వెంగమాంబ అన్న సత్రం దగ్గర 15 ఏళ్ల పిల్లోడు మృతి

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో విషాదం చోటు చేసుకుంది. కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కింద పడి మరణించాడు. వెంగమాంబ అన్న సత్రం దగ్గర ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. నాగరత్నమ్మ, మల్లేష్ దంపతుల కుమారుడు మంజునాథ్ (15). మల్లేష్ 12  మంది కుటుంబ సభ్యులతో శుక్రవారం రాత్రి బెంగళూరు, మ్యాజిస్టీక్ నుంచి తిరుమల దర్శనానికి వచ్చారు. శనివారం తెల్లవారుజూమన స్వామి వారిని దర్శించుకున్నారు. 

అనంతరం శనివారం సాయంత్రం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వద్దకు చేరుకోగా.. ప్రమాదవశాత్తూ 4వ నెంబర్ హాల్ గేట్ వద్ద మంజునాథ్ కిందపడిపోయాడు. తీవ్ర గాయాలై సృహా కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే మంజునాథ్‎ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్య సేవల నిమిత్తం స్విమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం స్విమ్స్‎లో మంజునాథ్ మృతి చెందాడు.

ALSO READ | ఏనుగుల దాడి.. ఐదుగురు భక్తులు మృతి

 దైవ దర్శనానికి వచ్చి కుమారుడిని కోల్పోవడంతో మల్లేష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కలియుగ దైవం ఏడుకొండల స్వామి సన్నిధిలో ఇటీవల వరుస విషాదాలు జరగడంతో భక్తులు ఆందోళన చెందున్నారు.