సరిగ్గా 15ఏళ్ల క్రితం... ఇదే రోజు.. హైదరాబాద్ మహా నగరంలో రక్తం ధారలై ప్రవహించింది. అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఏ తప్పూ చేయకుండానే వారి కుటుంబాలకు జీవితకాల శిక్ష పడింది. ఇప్పటికీ ఎంతో మంది గుండెల్లో దడ పుట్టించే సంఘటన కోఠి గోకుల్ చాట్, లుంబినీ పార్క్ బాంబు పేలుళ్లు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రోడ్డు పైకి సరదాగా వచ్చిన వారు కొందరైతే.. ఆకలితో వచ్చిన వారు మరికొందరు.. అంతా ఈ దుర్ఘటనలో బాధితులుగా మారారు. ఈ ఘటన జరిగి సరిగ్గా ఈ రోజుకు 15ఏళ్లు పూర్తయింది. కాగా ఈ పేలుళ్లలో 42మంది ప్రజలు మరణించారు.
ఈ నేపథ్యంలో గోకుల్ చాట్ వద్ద చనిపోయిన వారికి పలువురు బాధిత కుటుంబసభ్యులు నివాళులర్పించారు. అంతే కాకుండా పేలుళ్లలో అవయవాలు కోల్పోయి తీవ్ర అవస్థలు పడుతున్న వారికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా తమ బ్రతుకులు మారలేదని ఆరోపించారు.15సంవత్సరాలైనా తమను ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని, ఇప్పటికైనా తమను కనికరించాలని బాధితుడు సయ్యద్ రహీమ్ డిమాండ్ చేశారు.