
కోల్కతా/గువహటి: బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ నిర్వహించిన ప్రదర్శనలు హింసాత్మకంగా మారిన ఘటనల్లో పోలీసులు ఇప్పటి వరకూ 150 మందిని అరెస్టు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత వారం రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ముర్షిదాబాద్, సుతి, ధులియన్, శంశేర్ గంజ్, జాంగిపూర్లో ప్రదర్శనలు హింసకు దారితీశాయి. నిరసనకారులు ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు. దుకాణాలు, ఇండ్లపై రాళ్లతో దాడి చేశారు. ఒక్క ముర్షిదాబాద్ లోనే 110 మందిపైనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. అయితే, హింసపై కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కేంద్ర బలగాలను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అల్లర్ల కారణంగా 400 మంది హిందువులు వారి ఇండ్లు విడిచి వెళ్లిపోయారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి తెలిపారు.