చార్జింగ్ ​పెట్టుకో.. దూసుకుపో!

చార్జింగ్ ​పెట్టుకో..  దూసుకుపో!
  • ఎలక్ట్రిక్ కార్ల కోసం గ్రేటర్ లో150 చార్జింగ్ పాయింట్లు
  • ఇప్పటికే వేర్వేరు చోట్ల  అందుబాటులో 71 పాయింట్లు
  • కొద్ది రోజుల్లో మరో 60 చోట్ల ప్రారంభం 
  • యూనిట్ కాస్ట్ రూ.15 మాత్రమే.. ప్రైవేట్ సెంటర్లతో పోలిస్తే ఖర్చూ తక్కువే 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఎలక్ట్రిక్​ వెహికల్స్(ఈవీ)ను ప్రొత్సహించేందుకు బల్దియా చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్​బంకుల లెక్క నగరంలో తగినన్ని చార్జింగ్ స్టేషన్స్​లేవని చాలామంది ఈవీ కార్లు కొనడానికి ఇంతకాలం ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం గ్రేటర్ లో ఈవీ కార్ల సంఖ్య 5వేల వరకు ఉన్నట్లు అంచనా. అయితే, ప్రభుత్వం  ఈవీ పాలసీ తీసుకురావడంతో బల్దియా గ్రేటర్​లో చార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంచేందుకు నడుం బిగించింది. ఇప్పటికే నగరంలోని మెయిన్​రోడ్లపై ఉన్న చార్జింగ్ స్టేషన్లే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. 

150 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని గతంలోనే బల్దియా ప్రతిపాదనలు పెట్టడంతో పాటు రెడ్కో  (రెన్యూవబుల్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ డెవలప్ మెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌)తో కలిసి సంయుక్తగా ఏర్పాటు చేయాలని ఒప్పందం కూడా చేసుకుంది. దీని ప్రకారం సెంటర్ల లొకేషన్​బల్దియా చెప్తే అక్కడ రెడ్కో స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఐదేండ్ల పాటు వీటి నిర్వహణ బాధ్యతలను కూడా రెడ్కోనే చూడనున్నది. ప్రస్తుతం గ్రేటర్​లో 131 చోట్ల చార్జింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 71 కేంద్రాలు రన్​అవుతున్నాయి. 60 చోట్ల ఎలక్ర్టిక్ కనెక్షన్ రిలీజ్ ప్రాసెస్ లో ఉంది. కొద్ది రోజుల్లోనే వీటిని ప్రారంభించనున్నారు.  మిగతా19 లో మూడు లోకేషన్లు ఫైనల్ అయినప్పటికీ, మరో16 లోకేషన్లు బల్దియా ఇవ్వాల్సి ఉంది. 

40 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్​

ప్రైవేట్ సెంటర్లతో పోలిస్తే బల్దియా ఈవీ చార్జింగ్ సెంటర్లలో చార్జింగ్​పెడితే అయ్యే ఖర్చు తక్కువే. పైగా ఈ స్టేషన్లను 60 కిలోవాట్స్ కెపాసిటీని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కోకారు దాదాపు 20 యూనిట్స్ కి పైగా కెపాసిటీతో ఉంటున్నాయి. బల్దియా సెంటర్లలో చార్జింగ్​పెడితే 35 నుంచి 40 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్​ అయిపోతుంది. గ్రేటర్ లో 200 వరకు ప్రైవేట్, చార్జింగ్ సెంటర్లుండగా, ఇక్కడ ఒక్కో యూనిట్ కు  రూ.20 నుంచి రూ.25 వరకు తీసుకుంటున్నారు. అలాగే 18 శాతం జీఎస్టీ  కూడా కలెక్ట్ చేస్తున్నారు. అదే బల్దియా సెంటర్ల వద్ద యూనిట్ కి రూ.13తో పాటు 18 శాతం జీఎస్టీ కలిపి  రూ.15.34 వరకు అవుతోంది. పేమెంట్ ​కూడా టీఎస్​ఈవీ యాప్ ద్వారా చేయొచ్చు.