- ముంపు ముప్పులో మంచిర్యాల.. కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో రాళ్లవాగుకు ఎగపోటు
- టౌన్‌లోని 150 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- తీర ప్రాంత గ్రామాల అలర్ట్
- జిల్లాలో 50కి పైగా గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- చెన్నూర్, కోటపల్లి మండలాల్లో మునిగిన పంటలు
మంచిర్యాల, వెలుగు : భారీ వర్షాలు, వరదలతో గోదావరికి వరద పోటెత్తింది. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రం 7 గంటలకు అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఓపెన్ చేసి 7 లక్షల క్యూసెక్కులు రిలీజ్ చేశారు. గంటగంటకు గోదావరికి వరద ఉధృతి పెరగడంతో తీర ప్రాంతాల పట్టణాలు, గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. మంచిర్యాలలోని రాళ్లవాగుకు గోదావరి ఎగతన్నుతోంది. ఏ క్షణమైనా జిల్లా కేంద్రంలోని పలు కాలనీలను వరద చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ముందు జాగ్రత్తగా ఎన్టీఆర్నగర్కాలనీలోని ఇండ్లను అధికారులు ఉదయం నుంచే ఖాళీ చేయించారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, కలెక్టర్ బదావత్ సంతోష్, డీసీపీ సుధీర్రాంనాథ్కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డి పరిస్థితి పర్యవేక్షించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, వైశ్యభవన్, ఆర్బీహెచ్వీ స్కూల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు 150 కుటుంబాలను తరలించారు. రాంనగర్, ఎల్ఐసీకాలనీ, ఆదిత్య ఎన్క్లేవ్ ఏరియాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. పలు మండలాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జన్నారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో....
జిల్లావ్యాప్తంగా12 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి సుమారు వెయ్యి కుటుంబాలను తరలించారు. జన్నారం మండలం రోటిగూడలో గీతామందిర్ ఫంక్షన్ హాల్, బాదంపల్లిలోని పోచమ్మవాడ ప్రజలకు బాదంపల్లి ఫంక్షన్ హాల్, పొనకల్ బుడగజంగాల కాలనీ, సుందరయ్య కాలనీలో వాసులను పీఆర్టీయూ భవన్, తపాల్పూర్ ఎస్సీ కాలనీ వాసులను జడ్పీ హైస్కూల్, తిమ్మాపూర్ లో ట్రైబల్వెల్ఫేర్స్కూల్, రాంపూర్ ఎస్టీ తండా, గొల్లవాడలో మాలసంఘం భవనం, ధర్మారం, గోండుగూడలో ప్రైమరీ స్కూళ్లలో శిబిరాలను ఏర్పాటు చేశారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారకలో స్థానిక స్కూళ్లలో క్యాంపులు ఏర్పాటు చేశారు. కోటపల్లి మండలం కొత్త దేవులవాడ, పాత దేవులవాడ గ్రామాల్లోని సుమారు 2వేల మందిని చెన్నూర్‌లోని సంతోషిమాత ఫంక్షన్‌హాల్‌కు, బోరంపల్లి గ్రామస్తులను కొల్లూర్ స్కూల్‌కు తరలించారు. చెన్నూర్మండలంలోని అక్కెపల్లి గ్రామస్తులను ఎంఆర్ఆర్గార్డెన్, చింతపల్లి, పొక్కూర్గ్రామస్తులను స్థానిక స్కూళ్లకు పంపించారు. చెన్నూర్టౌన్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న పది కుటుంబాలను సాయిరాం ఫంక్షన్‌హాల్‌కు తరలించారు.
బ్యాక్‌వాటర్‌తో మునుగుతున్న పంటలు..
కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని గోదావరి తీర గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వేల ఎకరాల్లో పత్తి నీటమునిగి రైతులు లబోదిబోమంటున్నారు. చెన్నూర్మండలం బీరెల్లి, సోమన్‌పల్లి, నాగాపూర్, పొక్కూర్, సుందరశాల, ముత్తారావుపల్లి, వెంకంపేట, నర్సక్కపేట, చింతలపల్లి గ్రామాల్లో నదీతీరంలోని పత్తి చేలు మునిగాయి. కోటపల్లి మండలంలోని రాంపూర్, దేవులవాడ, కొల్లూరు, బబ్బెరచెల్క, లక్ష్మీపూర్, అర్జునగుట్ట, రాపన్‌పల్లి గ్రామాల్లోని పత్తి చేలను వరద చుట్టుముట్టింది.
ఎల్లంపల్లికి గంట గంటకు పెరిగిన వరద
ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో గోదావరి ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గంట గంటకు వరద పెరిగింది. బుధవారం రాత్రి ఒంటిగంటకు 1.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా 15 గేట్లు ఓపెన్ చేసి 1.26 లక్షల క్యూసెక్కులు రిలీజ్ చేశారు. గురువారం ఉదయం 4గంటలకు 1.40 లక్షల క్యూసెక్కులు, 8గంటలకు 2.25 లక్షలు, 9గంటలకు 3.14 లక్షలు, 10గంటలకు 4.11 లక్షలు, 11 గంటలకు 5.17 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం 5 గంటలకు 6.87 లక్షలు, 6 గంటలకు 7.32 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో 40 గేట్లను ఓపెన్ చేసి 7.05 లక్షల క్యూసెక్కులు రిలీజ్చేశారు.
ALSO READ :మహారాష్ట్రలో దారుణం..అప్పు తీర్చలేదని..భర్త ముందే భార్యపై అత్యాచారం
82.9 మిల్లీమీటర్ల వర్షం
మంచిర్యాల జిల్లాలో బుధవారం సగటున 82.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో ఇదే రికార్డు వర్షపాతం. అత్యధికంగా నస్పూర్‌లో 131.3, లక్సెట్టిపేటలో 123.1, దండేపల్లిలో 120.6, మంచిర్యాల, జైపూర్ లో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
స్పెషల్ ఆఫీసర్‌గా భారతి హోళికేరి వరద పరిస్థితులను పర్యవేక్షించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోళికేరిని సర్కారు స్పెషల్ఆఫీసర్గా నియమించింది. ఇంతకుముందు ఆమె కలెక్టర్‌గా ఉన్నప్పుడు వరద సహాయ చర్యలు చేపట్టిన అనుభవం ఉంది.
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
జిల్లావ్యాప్తంగా వరద సహాయ చర్యల కోసం కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ఏర్పాటు చేశారు. వరద బాధితులు 08736–250501 నంబర్‌కు కాల్చేయాలని కలెక్టర్ సంతోష్సూచించారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కిందికి ఒరిగినా, విరిగిపోయినా, పడిపోయినా, విద్యుత్ తీగలు వేలాడుతున్నా సమాచారం అందించడం కోసం కంట్రోల్ రూమ్‌నంబర్7901628369కు కాల్ చేయాలన్నారు.