- పది మంది పరిస్థితి సీరియస్
తిరువనంతపురం: కేరళలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాసర్గోడ్ జిల్లా నీలేశ్వరంలోని అంజుతంబలం వీరర్కవు ఆలయ ప్రాంగణంలోని షెడ్డులో నిల్వ ఉంచిన ఫైర్ క్రాకర్స్ పేలి ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 150 మందికి పైగా కాలిన గాయాలయ్యాయి. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడిన వారిని కాసర్గోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాలతోపాటు కర్నాటకలోని మంగళూరులో ఉన్న పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరర్కవు ఆలయంలో వార్షిక కాళియాట్లం ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం రాత్రి గుడి వద్ద తెయ్యం ప్రదర్శన నిర్వహించారు.
దాన్ని చూసేందుకు మహిళలు, చిన్నపిల్లలు సహా వందలాది మంది ఆలయానికి వచ్చారు. నిర్వాహకులు ఆలయ ప్రాంగణంలోని షెడ్డులో ఫైర్ క్రాకర్స్ నిల్వ ఉంచారు. ఆ ప్రదేశానికి సమీపంలోనే పటాకులు కాల్చారు. పటాకుల నుంచి వచ్చిన నిప్పురవ్వలు పడి షెడ్డులోని ఫైర్ క్రాకర్స్ అంటుకున్నాయి. దీంతో షెడ్డులో మంటలు చెలరేగి చుట్టుపక్కల వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు. అందులో10 మందికి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.