![గ్రేటర్లో కొత్తగా 150 బస్షెల్టర్లు](https://static.v6velugu.com/uploads/2025/02/150-new-bus-shelter-proposal-for-tgsrtc_kLmFXevOba.jpg)
- బల్దియాకు ఆర్టీసీ ప్రతిపాదనలు
- కొత్త రూట్లలో స్టాపులున్న చోట ఏర్పాటుకు రిక్వెస్ట్
- ఎండాకాలం వస్తుండడంతో ఏర్పాట్లు
- ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా 1,250 బస్షెల్టర్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్‌పరిధిలో 150 కొత్త బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలంటూ గ్రేటర్‌ఆర్టీసీ అధికారులు జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు పంపారు. సిటీలో బస్షెల్టర్ల నిర్మాణ బాధ్యతలను జీహెచ్ఎంసీనే చూసుకుంటోంది. మహానగరంలో ఆర్టీసీ 2,800 బస్సులు నడుపుతుండగా, వీటిలో రోజుకు దాదాపు రెండున్నర లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరి కోసం ఆయా రూట్లలో ప్రస్తుతం 1,250 బస్షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే, బస్సులు ఆగే చాలా ప్రదేశాల్లో షెల్టర్లు లేవు. బస్సుల కోసం గంటల తరబడి నిలబడే వేచి చూడాల్సి వస్తోంది. స్టాప్లేకపోవడంతో డ్రైవర్లు కూడా ఒకరోజు ముందు, మరో రోజు వెనక ఆపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సులు రాగానే ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో కొత్త బస్షెల్టర్లు కట్టాలంటూ ఆర్టీసీ.. బల్దియాకు ప్రపోజల్స్పంపింది.
కొత్త రూట్లు పెరగడంతో..
కొత్త రూట్లలో తిరుగుతున్న బస్సులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో బస్షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్కారిడార్, సుచిత్ర నుంచి మేడ్చల్కారిడార్, లింగంపల్లి, పటాన్చెరు కారిడార్‌లో రోడ్ల వెడల్పు పనుల కారణంగా చాలా చోట్ల షెల్టర్లను తొలగించారు.
ఇక లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, ఉప్పల్, హబ్సిగూడ, జేబీఎస్, అల్వాల్, బొల్లారం తదితర ముఖ్యమైన ప్రాంతాల్లోనూ బస్షెల్టర్లు లేవు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో కొత్త బస్షెల్టర్ల కోసం ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏప్రిల్‌నాటికి వీటిని పూర్తిచేయాలని కోరుతున్నారు.
జేబీఎస్ నుంచి ఎయిర్‌పోర్టుకు ఆరు కొత్త పుష్పక్ బస్సులు
శంషాబాద్ఎయిర్పోర్టుకు కనెక్టివిటీని పెంచుతూ గ్రేటర్‌ఆర్టీసీ అధికారులు ఆరు కొత్త పుష్పక్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రాణిగంజ్, నాంపల్లి, సెక్రెటేరియెట్, రవీంద్రభారతి, హజ్‌హౌస్, గాంధీభవన్, ఎంజేమార్కెట్, అఫ్జల్ గంజ్, బహదూర్‌పురా, ఆరాంఘర్ మీదుగా ఎయిర్‌పోర్టు వరకు వీటిని నడపనున్నారు. ప్రతిరోజు అర్ధరాత్రి దాటాక 12.55 గంటలకు జేబీఎస్ నుంచి పుష్పక్ బస్సులు మొదలవుతాయి. ఈ రూట్లలో గంటకో బస్సు నడుస్తుంది. ఎయిర్‌పోర్టు నుంచి ఆఖరు బస్సు రాత్రి11.55కు ఉంటుంది.