రాజులు మెచ్చిన గాజుల షాప్

రాజస్థాన్ ట్రెడిషన్, కల్చర్ కలర్​ఫుల్​గా కనిపిస్తుంది. రాయల్​ లుక్​తో ప్రతి వస్తువూ కళ్లు తిప్పుకోనివ్వదు. ఇక లేడీస్ జువెలరీ అంటే చెప్పేదేముంది? ఏ షాప్​లో అడుగుపెట్టినా టైం తెలియదు. ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అవ్వడమే కష్టం అంటారు. బ్లూ సిటీ జోథ్​పూర్ వెళ్లేవాళ్లు మాత్రం కచ్చితంగా విజిట్ చేయాల్సిన షాప్ ఒకటుంది. అదే ‘బిబాజీ చురీవాలే’.

జోథ్​పూర్​లో సందడిగా ఉండే మార్కెట్. అందులోని ఓ చిన్న సందులో ఉంది బిబాజీ చురీవాలే షాప్. చాలా చిన్న షాప్​. కానీ, దీని చరిత్ర మాత్రం చాలా పెద్దది. నూటయాభై ఏండ్ల నాటిది ఈ షాప్. ఈ ఒక్క మాట చాలు. టూరిస్టులు చెక్ లిస్ట్​లో పెట్టుకోడానికి.

నాయనమ్మే ఎంట్రప్రెన్యూర్

ప్రస్తుతం ఈ షాప్​ను నడుపుతున్నది సతార్​. అతని నాయనమ్మ బిబీజీ. నూటయాభై ఏండ్ల కిందట జోథ్​పూర్​లో గాజుల వ్యాపారం మొదలుపెట్టింది. రాజ వంశీకుల అంతఃపురాలకే వెళ్లి రంగురంగుల గాజుల మోడల్స్​ను చూపించేది. అప్పటికి గాజుల వ్యాపారం అంతా మగవాళ్లే చేసేవారు. వాళ్లకు అంతఃపురాల్లోకి, మహల్స్​లోకి ఎంట్రీ ఉండేది కాదు. రాజవంశీకులకు కావాల్సినవి కొన్ని పంపి స్తుంటే అక్కడ ఆడవాళ్లు తీసుకునేవారు. నచ్చినా నచ్చకపోయినా అడ్జస్ట్ అయ్యేవారు. కానీ బీబీజీ మహిళ కావటంతో డైరెక్ట్​గా అంతఃపుర స్త్రీలను కలిసే అవకాశం దొరికింది. వాళ్లకు కూడా నచ్చి నట్టు గాజులు డిజైన్స్ చేయించుకునే వీలు కుదిరింది. అలా బీబీజీ గాజుల వ్యాపారం డెవలప్ అయింది. ఒక బుట్టలో గాజుల సంచి పెట్టుకుని ఉదయాన్నే వెళితే, మధ్యాహ్నం కొన్ని కొత్త ఆర్డర్లను తీసుకొచ్చేది. ఆమె చేసే గాజుల డిజైన్లు కూడా కొత్త తరహాలో ఉండటంతో బిజినెస్​కి క్రమంగా క్రేజ్ పెరిగింది.

అమ్మ వెనక పిలగాడు

బీబీజీ ఏ మహల్​కి వెళ్లినా వెనకాల సంచి పట్టుకుని ఆమె కొడుకు మహమ్మద్ భక్ష్ కూడా తోడు వెళ్లేవాడు. చిన్న పిలగాడు కావడంతో అంతఃపురంలోనికి వెళ్లేందుకు రిస్ట్రిక్షన్​ ఉండేది కాదు. అలా అమ్మ దగ్గరే గాజుల తయారీ, అమ్మకాల్లో టెక్నిక్స్ నేర్చుకున్నాడు. 1920 నుంచి పూర్తిగా వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. బీబీజీ కంటే కలర్ ఫుల్ డిజైన్స్ చేసే వాడు. అమ్మతో తిరగడం వల్ల మహమ్మద్​ను బీబాజీ అని పిలిచేవాళ్లు. అదే పేరు స్థిరపడింది కూడా. 

మనవడి పేరు కూడా

మహమ్మద్ కొడుకు పేరు అబ్దుల్.1970 నుంచి షాప్ పనులు చూసుకుంటున్నాడు. ఆయన్ను కూడా బిబాజీ అనే పిలుస్తున్నారు. బిబాజీ అనేది బ్రాండ్ అయిపోయింది. అందుకు తగ్గట్టే ప్రతి డిజైన్​ను కేర్​ఫుల్​గా చేస్తారు. కలర్, సైజ్ సెట్ వేరియేషన్స్ ప్రిపేర్ చేస్తారు. క్రిస్టల్, గ్లాస్, మెటల్.. ఏ రకమైన మెటీరియల్ అయినా.. వీళ్ల చేతిలో పడితే రాయల్​లుక్​లో మెరిసిపోతాయి. బ్రైడల్ ఆర్డర్స్ ప్రత్యేకంగా చేయించుకుంటారు. కొందరు మ్యారేజ్ వెన్యూకే వీళ్లను పిలిపించి అక్కడే గాజులు తయారు చేయిస్తుంటారు కూడా. 

ప్రముఖుల పలకరింతలు

ఉదయ్ పూర్, జోథ్ పూర్ రాజ సంస్థానాలకు గాజులు తయారు చేసి ఇచ్చిన సంగతి తెలిసిందే. అంబానీ ఫ్యామిలీకి కూడా బ్రైడల్ స్పెషల్ కలెక్షన్ అందించారు బిబాజీ చురీవాలే. సచిన్ టెండూల్కర్–అంజలి, అభిషేక్​బచ్చన్–ఐశ్వర్యా రాయ్, జాన్వీ కపూర్ లాంటి ఫేమస్ పర్సన్స్ కి కూడా గాజులు తయారుచేసి అందించాడు బిబాజీ. రాజస్తాన్​​లో ఎంతోమంది పెండ్లి గాజులు చేయించుకుని, అవి వేసుకుని బిబాజీ బ్లెసింగ్స్ కూడా తీసుకుంటున్నారు.