సికింద్రాబాద్‌‌లో 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం

జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌ వాసులు ఉలిక్కిపడే కథనమిది. డబ్బాల్లోని అల్లం, వెల్లుల్లి పేస్ట్ వాడేసుకుంటూ వంటలను లొట్టలేసుకుని తింటున్న వారంతా హడలి పోవలసిందే. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో భారీ స్థాయిలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. ఏకంగా 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వీరి కల్తీ గుట్టు బయటపడటం ఒక ఎత్తైతే.. ఇన్నాళ్లు వీరు సదరు కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఎక్కడెక్కడ సరఫరా చేశారో తెలిస్తే.. ఓరి దేవుడో అనాల్సిందే.

ALSO READ | బ్రాండెడ్ ​అంటూ నకిలీ వైర్లు విక్రయం.. రాజస్థాన్ వ్యాపారి అరెస్ట్

నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లే వీరి టార్గెట్ అట. దీన్ని బట్టి వీరు తాయారు చేసిన అల్లం, వెల్లుల్లి పేస్ట్ మీరు తిన్నారా లేదా అనేది మీరే తేల్చుకోవాల్సిందే. బహుశా..! ఈపాటికి ఆరగించే ఉంటారు. బోయిన్‌పల్లి, రాజరాజేశ్వరి నగర్‌లో ఖార్కానాలో 'సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌' పేరిట వీరు ఈ దందా సాగిస్తున్నారు. ఆదివారం(నవంబర్ 17) కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌, బోయిన్‌పల్లి పోలీసులు సంయుక్తంగా తయారీ యూనిట్‌పై దాడి చేశారు. ఈ దాడుల్లో 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టుబడగా.. మరో 4లక్షల 50 వేలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌' యజమాని మహ్మద్ షకీల్ అహ్మద్ పరారీలో ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.