వానరానికి శ్రాద్ధకర్మలు.. ఇద్దరి అరెస్ట్

వానరానికి శ్రాద్ధకర్మలు.. ఇద్దరి అరెస్ట్

భోపాల్ : మధ్యప్రదేశ్లో ఓ వానరానికి అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు చిక్కుల్లో పడ్డారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కటకటాలపాలయ్యారు. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్ జిల్లాలోని దాలూపూర్ గ్రామానికి తరుచూ ఓ కోతి వస్తుండేది. స్థానికులు హనుమంతుడి ప్రతిరూపంగా భావించి దాన్ని బాగా చూసుకునేవారు. డిసెంబర్ 29న అకస్మాత్తుగా ఆ వానరం చనిపోయింది. తామెంతో ప్రేమగా చూసుకునే మూగజీవి మరణించడంతో కన్నీరుమున్నీరైన స్థానికులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం చందాలు వేసుకుని శ్రాద్ధకర్మలు నిర్వహించాలని నిర్ణయించారు. దిశదిన కర్మ కోసం కార్డులు ప్రింట్ చేసి అందరికీ పంచారు. హరి సింగ్ అనే యువకుడు హిందూ సంప్రదాయం ప్రకారం గుండు చేయించుకుని శ్రాద్ధ కర్మలు నిర్వహించారు. దశదిన కర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనాలకు పిల్లలు, మహిళలు అనే తేడా లేకుండా దాదాపు 1500 మంది హాజరయ్యారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత అసలు కథ మొదలైంది. వానరం శ్రాద్ధకర్మకు 1500 మంది హాజరైన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో కాస్తా పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ కేసు బుక్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసుల ఎంట్రీతో తమను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో కార్యక్రమంలో పాల్గొన్న మరికొందరు స్థానికులు ఇతర ప్రాంతాలకు పారిపోయారు. 

మధ్యప్రదేశ్లో కొంతకాలంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం 2వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలు కఠినం చేసింది. ప్రజలు గుంపులుగా గుమికూడకుండా 144 సెక్షన్ అమలు చేస్తోంది. 

మరిన్ని వార్తల కోసం..

యూపీలో బీజేపీకి ఝలక్ ఇచ్చిన మినిస్టర్

అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి దూరం