ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయట్లే!

ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయట్లే!
  • 70 శాతం ప్లాంట్లు రిపేరుకొచ్చినా పట్టించుకోని అధికారులు
  • భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 85 గిరిజన ఆశ్రమ స్కూళ్లలో15వేల మంది స్టూడెంట్స్​
  • గిరిజన బిడ్డలకు అందని స్వచ్ఛమైన తాగునీరు
  • ఆఫీసర్ల  తీరుపై విద్యార్థి, గిరిజన సంఘాల ఆగ్రహం 
  • వెంటనే రిపేర్లు చేయించాలంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన బిడ్డలకు స్వచ్ఛమైన తాగు నీరందించేందుకు ఏర్పటు చేసిన ఆర్వో ప్లాంట్లు 70 శాతానికిపైగా పని చేయడం లేదు. కలెక్టర్​తో సహా ఐటీడీఏ పీవో, డీటీ డబ్ల్యూఓ  ఆశ్రమ స్కూళ్లను​ తరచూ సందర్శిస్తున్నా  స్టూడెంట్లకు స్వచ్ఛమైన తాగునీరందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

85 స్కూళ్లలో 15 వేల మంది.. 

భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 85 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 15వేల మంది స్టూడెంట్స్​ చదువుకుంటున్నారు.  గతంలో ఈ స్కూళ్లలోని ట్యాంకుల్లోని నీళ్లు తాగి విద్యార్థులు పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో మూడేండ్ల కింద లక్షలు ఖర్చు పెట్టి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్లను  ఏర్పాటు చేశారు. తొలుత రిపేర్లు కూడా వెనువెంటనే చేయించారు. 

కానీ ఏడాదిగా ప్లాంట్లను ఎవరూ పట్టించుకోవడం లేదు.  రిపేర్లకు కూడా నోచుకోకపోవడంతో ఉప్పుసాక, కోయగూడెం, గంగారం, ఉల్వనూర్, ఇల్లెందు, అశ్వారావుపేట, టేకులపల్లి, పాల్వంచ మండలాలతో పాటు ​జిల్లాలోని దాదాపు 70శాతానికి పైగా స్కూళ్లలో ఆర్వో ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. వాటిని రిపేరు చేయించడం లేదని, పూర్తిగా పాడైన చోట కొత్తవి ఏర్పాటు చేయడం లేదని అంటున్నారు. 

రిపేర్లు చేయించేందుకు చర్యలు 

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని స్టూడెంట్స్​కు పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. చాలా స్కూళ్లలో ఆర్వో ప్లాంట్లు పాడయ్యాయి. వాటిని రిపేర్లు చేయించేందుకు చర్యలు చేపడుతున్నాం. కొత్త ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - మణెమ్మ, డీటీడబ్ల్యూ ఓ, భద్రాచలం ఐటీడీఏ

గిరిజన బిడ్డలపై చిన్నచూపొద్దు.. 

గిరిజన బిడ్డలపై ఆఫీసర్లకు చిన్న చూపొద్దు. ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు రిపేర్లకు వచ్చి ఏండ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదు. పరిశుభ్రమైన తాగు నీరు లేకపోవడంతో తరుచూ స్టూడెంట్స్​అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ పీవో స్పందించి ఆర్వోప్లాంట్లకు రిపేర్లు చేయించాలి. - పృథ్వి, పీడీఎస్​యూ స్టేట్​ లీడర్, ఇల్లెందు 

ఆర్వో ప్లాంట్లను పట్టించుకోవాలి 

ఐటీడీఏ పరిధిలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించాలి. ఎక్కడైనా రిపేరుకొస్తే వెంటనే చేసేలా చూడాలి. అలంకారప్రాయంగా ఉంచి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవద్దు. అన్నిచోట్ల కొత్త ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. అంతలోపు పాతవాటికి రిపేర్లు చేపట్టి అందుబాటులోకి తేవాలి. - భూక్యా రమేశ్, గిరిజన సంఘం నేత, కొత్తగూడెం