రామరాజ్యమంటే..

రామరాజ్యానికి ధర్మం, సత్యం మూలాధారాలుగా నిలిచాయి. ప్రజలు సత్యాన్నే మాట్లాడారు, ధర్మాన్ని ఆచరించారట. అన్నిటిలోనూ ఇతరులకు ఆదర్శంగా ఉన్న  రాముడు పాలనలోనూ ఆదర్శంగా నిలిచాడు.రామరాజ్యంలో హింసకు తావుండదు. ప్రజలందరూ శాంతియుతంగా, సంతృప్తిగా ఉండేవారట. అందుకే గాంధీ మాటల్లో రామరాజ్యం ప్రస్తావన తరచూ వస్తూ ఉండేది.

రామరాజ్యం అనే మాట వినడమే కానీ దాని సంగతి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. రామరాజ్యం అంటే ఆదర్శ రాజ్యం అంటారు. రాముడు వేలాది ఏళ్ల కిందట ఈ నేలను పాలించాడని,  ఓ రాజుగా తన దైన శైలిలో పాలించి  ప్రజల మెప్పు పొందాడని,  పాలకులందరికీ ఆదర్శంగా నిలిచాడని పురాణాలు చెబుతాయి. అందుకే  ఎప్పుడో త్రేతాయుగం నాటి రామరాజ్యాన్ని ఇప్పటికీ ఆదర్శ రాజ్యంగా చెబుతారు. గాంధీజీ  దృష్టిలో రామరాజ్యం అంటే హిందూ రాజ్యంకాదు. రామరాజ్యం అంటే అసమానతలు లేని రాజ్యం. రామరాజ్యం అంటే ఓ ఆదర్శ పాలన.  1929 సెప్టెంబర్ 19 నాటి ‘యంగ్ ఇండియా ’ పత్రికలో గాంధీజీ ఈ విషయమే చెప్పారు. ఇక్కడ రామరాజ్యం అంటే ప్రజలే పాలకులైన రాజ్యం.

ప్రజలందరూ సంతృప్తిగా జీవించడానికి అవసరమైన పరిస్థితులు ఉన్న రాజ్యం. అంతేకాదు ఏ కారణాల వల్ల కానీ ప్రజల్లో ఏ వర్గం కూడా వివక్షకు గురి కాని పాలన జరిగిన రాజ్యం. కోటలో ఉండే రాకుమారుడు, తోటలో ఉండే పేద వాడు ఒకే రకమైన హక్కులు కలిగి ఉన్న రాజ్యం.

మన రాజ్యం.. రామరాజ్యం కావాలి

బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోతేనే రామరాజ్యం వస్తుందన్నది గాంధీ సిద్దాంతం కాదు. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోతే  మనవాళ్లే అధికారంలోకి వస్తారు. మన రాజ్యమే వస్తుంది. అయితే మన రాజ్యం వస్తేనే సరిపోదనే వారు గాంధీజీ. మన రాజ్యం….రామరాజ్యంగా మారాలంటారు. 1937 లో ఓ పత్రికలో ఈ విషయాన్ని  ఆయన స్పష్టం చేశారు. అందుకే రామరాజ్యం గురించి ఆయన కలలు కన్నారు.రామరాజ్యం  ప్రస్తావనను ఎక్కువగా తీసుకువచ్చారు.

హింసకు తావులేని రాజ్యం

గాంధీజీ చెప్పిన రామరాజ్యం అంటే ఓ ఆదర్శ రాజ్యం.అంతేకాదు రామరాజ్యంలో  హింసకు తావుండదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంగతి గమనించాలి. రాముడు అయోధ్య రాజధానిగా పాలించాడు. ‘అయోధ్య ’ అంటే యుద్ధం లేని ప్రాంతం అని అర్థం. నూటికి నూరు శాతం ప్రశాంతంగా ఉండే ప్రాంతం అని అర్థం చేసుకోవాలి. గాంధీజీ కోరుకున్నది ఇదే. యుద్ధం చేయాల్సిన అవసరం లేని సమాజాన్ని  ఆయన కోరుకున్నాడు. ప్రజలు సుఖసంతోషాలతో బతకాలని ఆయన  ఆశించాడు. ఇవాళ్టి  పరిస్థితుల్లో  శాంతిని కోరుకోని దేశం అంటూ  ఏదైనా ఉంటుందా ? అనే ప్రశ్నకు ‘ నో ’ అనే సమాధానం వస్తుంది. అందుకే  ఇప్పటికీ ప్రజలు రామరాజ్యం కాన్సెప్ట్ కు జేజేలు కొడుతున్నారు. అందుకే వేల ఏళ్ల తరువాత కూడా రామరాజ్యం ఒక ‘ ఐడియల్ స్టేట్ ’ గా మారింది.

రాముడికి మరో పేరుంది. అదే మర్యాద పురుషోత్తముడు. రాముడు  ఓ ఆదర్శ కుమారుడు. అంతేకాదు అన్న అంటే ఇలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి అని అందరూ అనుకునేలా ప్రవర్తించిన వ్యక్తి. వీటన్నిటికీ మించి ఓ ఆదర్శ పాలకుడు.  ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న ఓ ప్రేమమూర్తి. రాముడు శాంతిని కోరుకున్నాడు. అలా అని శత్రువుల విషయంలో వెనక్కి తగ్గలేదు.ప్రజల పట్ల ప్రేమమూర్తి గా ఉంటూనే  శత్రువుల పట్ల సింహస్వప్నంగా ఉన్నాడు. రాముడిలో ఉన్న ఈ లక్షణాలన్నీ ఒక  ఆదర్శవంతమైన పాలకుడిలో తప్పకుండా ఉండాలంటారు గాంధీజీ. అందుకే రాముడి వంటి పాలకులు ఉన్న రామరాజ్యాన్ని గాంధీజీ కోరుకున్నారు.

వాల్మీకి చెప్పిందేమిటంటే..

వాల్మీకి రామాయణంలో రామరాజ్యం గురించి వివరించారు. సత్యం. ధర్మం మీద నడిచిన రాజ్యమే రామరాజ్యం అంటాడు వాల్మీకి. రామరాజ్యంలో రుతువుల్లోనే వర్షాలు పడ్డాయి. ఫలితంగా విరగకాసిన పంటలు రైతుల చేతికందేవి. రైతుల  ఇళ్లల్లో ధాన్యం రాశులు పోసి ఉండేవి. కరవు అనే మాటే విని ఎరగరు అప్పటి  ప్రజలు. తల్లిదండ్రుల కళ్లెదుటే వాళ్ల సంతానం చనిపోవడం వంటి అనర్థాలు ఏనాడూ జరగలేదు. తోటలన్నీ పూలతో గుబాళించేవట.

రామరాజ్యంలో దోపిడీలు, దొంగతనాలకు తావు ఉండేది కాదట. రోడ్ల మీద ఎంత ఖరీదైన ఆభరణాలు కానీ, నగలు కానీ మరచిపోయినా వాటినెవరూ తీసుకు వెళ్లే వారు కాదట. సొంతదారులు వచ్చేంతవరకు అవి అలాగే రోడ్ల మీదే ఉండేవట.

ప్రజలు చాలా ఎక్కువ కాలం బతికేవాళ్లు. కొడుకులు, కూతుళ్లనే కాదు మనవలు, మనవరాళ్లను  కూడా చూసేంతకాలం బతికే వాళ్లు. అంతేకాదు వాళ్ల పెళ్లిళ్లు కూడా చూసుకుని ఆనందపడేవారు. ఎలాంటి రోగాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవారు. అసూయాద్వేషాలు ఉండేవి కాదు. ఎవరి జీవితాలు వాళ్లు సంతృప్తిగా బతికేవారట.

వాల్మీకి రామాయణంలో రామరాజ్యం గురించి వివరించారు. సత్యం. ధర్మం మీద నడిచిన రాజ్యమే రామరాజ్యం అంటాడు వాల్మీకి. రామరాజ్యంలో రుతువుల్లోనే వర్షాలు పడ్డాయి. ఫలితంగా విరగకాసిన పంటలు రైతుల చేతికందేవి. రైతుల  ఇళ్లల్లో ధాన్యం రాశులు పోసి ఉండేవట. కరవు అనే మాటే విని ఎరగరుట అప్పటి  ప్రజలు. తల్లిదండ్రుల కళ్లెదుటే వాళ్ల సంతానం చనిపోవడం వంటి అనర్థాలు ఏనాడూ జరగలేదు. తోటలన్నీ పూలతో
గుబాళించేవట.

     సైనికులు  దేశానికి రక్షణగా నిలబడేవారని,  ఎప్పటికప్పుడు శత్రు రాజుల కదలికలను డేగకళ్లతో పరిశీలిస్తూ  దేశాన్ని కాపాడేవారని,  రామరాజ్యంలో ఎటు చూసినా ఆదర్శ కుటుంబాలే ఉండేవట.

రాముడు అందరికీ ఆదర్శమైన పాలన అందించాడంటాడు వాల్మీకి. అందుకే వేల ఏళ్లు దాటినా  రామరాజ్యం అనే కాన్సెప్ట్  ఇప్పటికీ సజీవంగానే ఉంది. దీనికి మూలం ధర్మం. రాముడు ఏలిన సమయంలో ప్రజలు ధర్మాన్ని తప్పకుండా పాటించేవారంటారు. ధర్మం ఆచరించడంతో అంతా శుభమే జరుగుతుందని వాల్మీకి రాశాడు. అందుకే ఒకరకంగా రామరాజ్యాన్ని  ‘ధర్మ రాజ్య’ గా చూడాలని అంటారు.