నల్గొండ, వెలుగు: ఆరేడు నెలల్లో ఉమ్మడి నల్లొండ జిల్లా అభివృద్ధికి రూ. 1,544 కో ట్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ను గెలిపించినందుకు కృతజ్ఞతగా, సీఎం కేసీఆర్ఆదేశాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. పది, పన్నెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, ఆలోగా ఉమ్మడి నల్లొండ జిల్లాలో పనులన్నీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గురువారం మునుగోడులో కేటీఆర్ ఆధ్వర్యంలో రివ్యూ జరిగింది. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి పనులను సమీక్షించారు. ఇందులో మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రైతుబంధు కార్పొరేషన్‌చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. రివ్యూ అనంతరం కేటీఆర్మీడియాతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలో దెబ్బతిన్న ఆర్ అండ్‌బీ రోడ్ల రిపేర్లు, కొత్త రోడ్ల నిర్మాణానికి రూ. 40 కోట్లు మంజూరు చేస్తున్నామని, పంచాయతీరాజ్డిపార్ట్మెంట్ కింద గ్రామీణ రోడ్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో అభివృద్ధికి రూ. 334 కోట్లు ఇస్తామన్నారు.
మునుగోడుకు ప్రత్యేక నిధులు
ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు మునుగోడు అభివృద్ధికి కట్టుబడిఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే ఫలితాలొచ్చిన నెలలోపే రివ్యూ కోసం ఇక్కడికి వచ్చామన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకోసం ఆరేడు నెలల్లో మునుగోడులో రూ.393 కోట్లు ఖర్చు పెడ్తామని తెలిపారు. ఇందులో ఆర్ అండ్‌బీ రోడ్లకు రూ.100 కోట్లు, పంచాయతీ రాజ్రోడ్లకు రూ.175 కోట్లు, చండూరు మున్సిపాలిటికీ రూ.30 కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.50 కో ట్లు కేటాయిస్తామని వివరించారు. గిరిజన తండాల రోడ్లకు రూ.25 కోట్లు ఇస్తామన్నారు. నియోజకవర్గంలో ఐదు విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, వంద పడకల ఆసుపత్రిని నెలకొల్పుతామని, దండుమల్కాపురం ఇండస్ట్రియల్ కారిడార్‌లో పది వేల మందికి ఉపాధి లభించేలా టాయ్‌పార్క్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. టాయ్పార్క్ఏర్పాటుకోసం ఇప్పటికే వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరిపామన్నారు. చండూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. నారాయాణ్పూర్లో రూ. 1 కోటితో సేవాలాల్ బంజారా భవన్ నిర్మిస్తామని, గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని, రూ. 4 కోట్లతో భువనగిరి, నారాయాణ్పూర్, గట్టుప్పల్, తేరేటికల్లో హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. నూలుమీద 40 శాతం సబ్సిడీ జీవోను కూడా త్వరలోనే సవరిస్తామని కేటీఆర్ చెప్పారు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో గిరిజనుల అభివృద్ధికి మరో రూ. 100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కొత్త చెక్ డామ్ ల కోసం వారం రోజుల్లో పూర్తి వివరాలతో ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
మార్చిలోపు ప్రతి మున్సిపాలిటీలో పది కార్యక్రమాల ఎజెండా
వచ్చే మార్చిలోపు రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో పది కార్యక్రమాల ఏజెండా తప్పనిసరిగా అమలు చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెద్ద, చిన్న మున్సిపాలిటీలన్న తేడా లేకుండా వైకుంఠధామాలు, ఆధునిక దోభీఘాట్లు, డిజిటల్ డోర్ నంబర్లు, మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. 75 చదరపు గజాల్లో ఇల్లు కట్టు కోవాలంటే 21 రోజుల్లో ఫ్రీగా అనుమతివ్వాలని, 600 గజాల వరకు వెంటనే ఇంటి నిర్మాణానికి అనుమతివ్వాలని చెప్పారు. మార్చి 31లోపు ప్రతి మున్సిపాలిటీలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు నిర్మించాలన్నారు. డంపింగ్ యార్డులు తొలగించడానికి బయోమైనింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. చిన్న మున్సిపాలిటీల్లో ఉన్న సెలూన్ల వివరాలు పంపాలని, సెలూన్లను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ. 2 లక్షల ఆర్థికసాయం అందించే ఆలోచనలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
2014 నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి: జగదీశ్ రెడ్డి
2014 నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధి ప్రారంభమైందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు అందించాలన్న ఆలోచన కేటీఆర్‌దేనని ఆయన తెలిపారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో రోడ్ల మీద రూ. 20 వేల కోట్లు, భవనాలకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 69.9 కోట్లతో 70 రోడ్డు పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 136 కి.మీ. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చామని తెలిపారు. తండాల నుంచి గ్రామ పంచాయతీలకు వెళ్లే లింకు రోడ్లను పూర్తి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఉపాధి హామీ కింద జీపీ ట్రాక్టర్ల ద్వారా పనులు చేపట్టి ట్రాక్టర్ బకాయిలు తీర్చాలన్నారు. డంపింగ్ యార్డులలో ఎరువులు తయారీతో పంచాయతీల ఆదాయం పెంచుకోవాలని తెలిపారు. 8 ఏండ్లలో ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్ కింద రూ. 1200 కోట్లు ఖర్చు చేశామని, 731 కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలను త్వరలో మంజూరు చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోడు సమస్యను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రెండు లక్షల అప్లికేషన్స్ రాగా.. 55, 763 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్నారు.