‘అభయహస్తం’ పేరుతో ఎన్నికల ప్రణాళికలో విద్యకు 15% బడ్జెట్ కేటాయించి, బడులను పటిష్టం చేసి నాణ్యమైన విద్యను అందిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని జోడోయాత్ర సందర్భంగా ప్రకటించారు.
10 సంవత్సరాలు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం పాఠశాల విద్యకు కేటాయించిన బడ్జెట్ సగటుగా 6.6% మాత్రమే. కాంగ్రెస్ సర్కారు 2024-2025 రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కేటాయించింది 7.6% మాత్రమే. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలు విద్యకు కేటాయించిన సగటు బడ్జెట్ 14.7% లో సగం మాత్రమే. ఫలితంగా రాష్ట్రంలో 5,895 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నడుస్తున్నాయి. 2,097 పాఠశాలల్లో పిల్లలే లేరు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 సంవత్సరాలు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు బాలుర్లకు 74.1% , బాలికలకు 85.4% ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయి.
పాఠశాలల పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మన రాష్ట్రం 21వ స్థానంలో నిలిచింది. అభ్యసన ప్రమాణాలలో 35వ స్థానంలో ఉంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సామర్థ్యం 50% కన్నా తక్కువ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల విద్యాసామర్థ్యాలు కూడా కొంచెం అటు ఇటు తప్ప పెద్దగా తేడా లేదు.
అలాగే సామాజిక వర్గాలవారీగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మరింత ఆందోళనకరంగా ఉంది. వారి సామర్థ్యాలు 30శాతం వరకే ఉన్నాయి. అసర్- 2024 నివేదిక కూడా విద్యార్థుల విద్యా సామర్థ్యాలలో పెరుగుదల లేదని తెలిపింది. ఈ గణాంకాలు తెలంగాణ విద్య సంక్షోభంలో ఉందని సూచిస్తున్నాయి.
1244 పోస్టులు ఖాళీ
రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల పర్యవేక్షణ కోసం పూర్తిస్థాయి డిప్యూటీ విద్యాధికారులు, మండల విద్యాధికారులు లేరు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండడం వలన అవేవీ జరగడం లేదు. ఫలితంగా అభ్యసన సామర్థ్యాలు సాధించడంలో దేశంలో 35వ స్థానానికి దిగజారాం.
విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నా అత్యధిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలేదు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయులతో పాటు విద్యాహక్కు చట్టం షెడ్యూల్లో సూచించిన పది అంశాలతో తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో డీఈవోలు, ఎంఈవోలు, డైట్ సిబ్బంది, ఎస్ సీఈఆర్టీ మొదలగు విభాగాల్లో 1497 మంది పర్యవేక్షణ అధికారులు అవసరం ఉండగా, కేవలం 253 మంది మాత్రమే పని చేస్తున్నారు. 1,244 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దయనీయ స్థితిలో గురుకులాలు, హాస్టళ్లు
విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, మైనార్టీశాఖల ఆధ్వర్యంలో 1,002 గురుకులాలు ఉండగా వాటిలో దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే 1,523 సంక్షేమ హాస్టళ్లలో మూడు లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. పేద వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్న ఈ గురుకులాలు, హాస్టళ్లు చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. సుమారు 750 గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వసతులు ఏమాత్రం నివాస యోగ్యంగా లేవు. రాష్ట్రంలో 149 ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 35,700 అంగన్వాడి కేంద్రాలు నడుస్తున్నాయి.
ముఖ్యమంత్రి ప్రకటించినట్లు అంగన్వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య అందించే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో దాదాపు 40 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో వలస కుటుంబాల పిల్లలు అధికంగా ఉండడం, ప్రభుత్వ పాఠశాలలు వారికి అందుబాటులో లేకపోవడంతో అధికశాతం పేద వర్గాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్డును యూనిట్‌గా తీసుకొని అక్కడి పిల్లల జనాభాను బట్టి కేజీ నుంచి ఇంటర్ వరకు
ప్రభుత్వ పాఠశాలలను అందుబాటులోకి తేవాలి.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
రాష్ట్రంలో మొత్తం విద్యార్థుల్లోని ముస్లిం విద్యార్థులు 5.3% మంది బాలురు, బాలికలు 4.8% మంది మాత్రమే ఉన్నారు. ఈ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. బాలబాలికలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు 54,000 మంది కార్మికులు మధ్యాహ్న భోజనం వండి పెడతారు.
వారికి గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులను చెల్లించాలనే విద్యా కమిషన్ సూచనను అమలుచేయాలి. ఈ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ అమలుకావడం లేదు. ప్రమాద బీమా, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారం సక్రమంగా అందితేనే వారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. అభ్యసన సామర్ధ్యాలు మెరుగవుతాయి. ప్రతి పాఠశాలకు తరగతికో గది, అదనంగా ప్రధాన ఉపాధ్యాయుని గదితోపాటు, ఆటస్థలం, ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, మంచినీటి వసతి తదితర సౌకర్యాలు ఉండాలి. ప్రతి పాఠశాలకు పారిశుద్ధ్య నిర్వహణకు స్కావెంజర్లు, కాపలాదారులు, అటెండర్లు, గుమాస్తాల నియామకం జరగాలి.
విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు
రాష్ట్రంలో ఉన్న పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాల నమూనాలో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు, కంప్యూటర్లు, ఇతర సిబ్బంది నియామకం జరగాలి. సబ్జెక్టువారీగా టీచర్లు, కంప్యూటర్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయుడు, డ్రాయింగ్, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్లను నియమించాలి. సుమారు 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్న ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ విపరీతంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
ప్రైవేటు విద్యను నియంత్రించడానికి స్వయంప్రతిపత్తి గల ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌ను వేయడంతో పాటు, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను పేదలకు కేటాయించే చర్యలు తీసుకోవాలి. విద్యా ప్రమాణాల పెంపుదల పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సమాజ అవసరాలకు కావాల్సిన మానవ వనరులను రూపొందించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది.
వనరుల కల్పనలో రాజీ పడకుండా అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే బాలలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో విద్యా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సమూల మార్పులు చేసి, అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లడానికి విద్యకు రాష్ట్ర బడ్జెట్లో ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లు 15 శాతం నిధులు కేటాయించాలి.
పెరుగుతున్న డ్రాపౌట్లు
గణాంకాల ప్రకారం తెలంగాణలో 27.4 శాతం విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేయకుండానే బడి మానేస్తున్నారు. వీరంతా బాల కార్మికులుగా మారిపోయే అవకాశం ఉంది. కనుక ఈ పిల్లలందరినీ బడిలోకి తీసుకురావడానికి బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేసి, యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టాలి. వలసలు వెళ్తున్న ప్రాంతాల్లో బాలల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
బాలిక విద్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి. ప్రతి కేజీబీవీ పాఠశాలల్లో పరిమితమైన కోర్సులు కాకుండా ఇంటర్‌లోని అన్ని కోర్సులను ప్రవేశపెట్టి కావాల్సిన వసతులను కల్పించాలి. రాష్ట్రంలో 475 కేజీబీవీ పాఠశాలల్లో లక్షా పదిహేను వేల మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 538 మంది మహిళా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
అతి తక్కువ వేతనాలతో బోధన, బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరు గురుకుల పాఠశాలల సిబ్బందితో సమానంగా పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ సమాన పనికి సమాన వేతనం అనే సహజ న్యాయానికి ఈ మహిళా ఉపాధ్యాయులు సిబ్బంది నోచుకోలేదు.
- కె. వేణుగోపాల్, టీపీటీఎఫ్–