IND vs AFG, 2nd T20I: టీమిండియా చెక్కు చెదరని రికార్డ్..వరుసగా 15 సిరీస్ విజయాలు

IND vs AFG, 2nd T20I: టీమిండియా చెక్కు చెదరని రికార్డ్..వరుసగా 15 సిరీస్ విజయాలు

టీ20ల్లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు బలంగా కనబడినా..గత నాలుగేళ్లలో అత్యంత నిలకడగా రాణించిన జట్టు టీమిండియానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంతగడ్డపై అయితే మన జట్టుకు తిరుగు లేకుండా పోయింది. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఇటీవలే రికార్డ్ సృష్టించిన టీమిండియా.. తాజాగా స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌‌ పై టీ20 సిరీస్ గెలిచి స్వదేశంలో వరుసగా 15 సిరీస్ విజయాలను సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. 

2019 నుంచి 2023 వరకు భారత్ సొంతగడ్డపై ఒక్క సిరీస్ లో కూడా ఓడిపోలేదు. 2006-2010 మధ్యలో ఆస్ట్రేలియా స్వదేశంలో వరుసగా 8 సిరీస్ ల్లో విజయం సాధిచింది. ఈ రికార్డ్ ను ఎప్పుడో బ్రేక్ చేసిన టీమిండియా..వరుసగా 15 సిరీస్ విజయాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రాహుల్, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ స్వదేశంలో ఈ వరుస సిరీస్ విజయాలు సాధించింది. 

ఇండోర్ వేదికగా నిన్న (జనవరి 14) జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను అలవోకగా ఆడేశారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో 6 సిక్సులు, 5 ఫోర్లతో 68 పరుగులు చేసి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. మరో ఎండ్ లో శివమ్ దూబే  32 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్లతో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది.