101 ప్లాట్లకు 16 అప్లికేషన్లే..స్పాట్ దరఖాస్తులపైనే ఆశలు

101 ప్లాట్లకు 16 అప్లికేషన్లే..స్పాట్ దరఖాస్తులపైనే ఆశలు

సిద్దిపేట/సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట అర్బన్ డెవలప్మ్మెంట్ అథారిటీ(సుడా) ఆధ్వర్యంలో మిట్టపల్లి వద్ద మెగా టౌన్‌‌ షిప్‌‌ పేరిట ఏర్పాటు చేసిన లేఅవుట్‌‌కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. అధికారులు పాంప్లెట్లు రూపొందించి విస్తృతంగా ప్రచారం చేసినా, రెండు సార్లు అవగాహన సదస్సులు పెట్టి సందేహాలు నివృత్తి చేసినా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. లేఅవుట్‌‌లోని 101 పాట్లకు సోమవారం పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో ఓపెన్ యాక్షన్‌‌ నిర్వహించనున్నా.. ఇప్పటి వరకు  16 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు స్పాట్ దరఖాస్తులపైనే ఆశలు పెట్టుకున్నారు. 

హైదరాబాద్‌‌, వరంగల్ తర్వాత సిద్దిపేటలోనే..

ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా సుడా హైదరాబాద్, వరంగల్ ప్రధాన నగరాల తర్వాత సిద్దిపేటలో మెగాటౌన్‌‌ షిప్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు అధికారులు మిట్టపల్లి వద్ద అసైన్డ్‌‌ పట్టాదారుల నుంచి ఎకరాకు 600 గజాలు ఇస్తామనే ఒప్పందంతో 14 ఎకరాలు సేకరించారు.  పట్టాదారుల ప్లాట్లు పోగా 101  ప్లాట్లు అమ్మకానికి సిద్ధం చేశారు. మౌలిక వసతులైన రోడ్లు, స్ట్రీట్ లైట్స్, డ్రైన్, పార్క్‌‌లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని పాంప్లెట్లు కూడా తయారు చేయించారు. ఒక్కో ప్లాట్ కనిష్టంగా 150  గజాలు,  గరిష్టంగా 250 గజాల విస్తీర్ణంలో ఉండగా.. గజానికి 8 వేల కనిష్ట ధరగా నిర్ణయించారు.  వీటిని ఓపెన్ యాక్షన్ ద్వారా అమ్మాలని నిర్ణయించారు.  ప్లాట్ దక్కించుకున్న వారు 25 శాతం డబ్బులు వెంటనే చెల్లించి మిగిలిన డబ్బులను మూడు నెలల్లో చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 

పట్టణానికి దూరంగా ఉండడంతోనే..

ప్లాట్ల ఓపెన్ యాక్షన్‌‌లో పాల్గొనాలనుకునే వారు రూ.5 వేలు డిపాజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలని  ఇప్పటికే  ప్రకటించిన అధికారులు సుడా ఆఫీసులో కౌంటర్‌‌‌‌ కూడా ఏర్పాటు చేశారు.  లేఅవుట్‌‌పై పాంప్లెట్లతో ప్రచారం చేయడంతో పాటు రెండు సార్లు అవగాహన సదస్సులు నిర్వహించడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఆశించారు. కానీ,  ఆదివారం వరకు 16 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. లేఅవుట్‌‌ పట్టణానికి దూరంగా ఉండడం, బేస్‌‌ రేట్‌‌లోనే ఈ ప్రాంతంలో ప్లాట్లు వస్తుండడం,  ఓపెన్ యాక్షన్‌‌లో ధరలు ఎంత పెంచుతారోనని అనుమానాలు ఉండడం.. ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్పాట్‌‌ దరఖాస్తులు కూడా రాకపోతే,  ఆశించిన విధంగా ప్లాట్లు అమ్మకపోతే మరోసారి ఓపెన్ యాక్షన్ నిర్వహిస్తామని ఓ అదికారి వెల్లడించడం గమనార్హం.

స్పందన వస్తుందని ఆశిస్తున్నం

సుడా ఆధ్వర్యంలో మిట్టపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న మెగా టౌన్ షిప్ ప్లాట్లకు గజానికి రూ.8 వేల బేస్ ప్రైస్‌ నిర్ణయించినం.  ఓపెన్ యాక్షన్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నం.  లేఅవుట్‌లో మౌలిక వసతుల పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ప్రజలకు ఇప్పటికే రెండు సార్లు సదస్సులు పెట్టి అనుమానాలు  నివృత్తి చేసిం. 

- మారెడ్డి రవీందర్ రెడ్డి, చైర్మన్ సుడా