విగ్రహం..వివాదం..ఎన్టీఆర్ స్టాచ్యూ చుట్టూ పాలిటిక్స్

  • ఎన్టీఆర్ స్టాచ్యూ చుట్టూ పాలిటిక్స్
  • కృష్ణుడి వేషధారణలో రెడీ చేసిన నిర్వాహకులు
  •  ఆ రూపం ఎందుకంటున్న యాదవ సంఘాలు
  • మార్చాలని హైకోర్టులో ఇస్కాన్ సహా 16 పిటిషన్లు
  • విచారించిన ఉన్నత న్యాయస్థానం
  • మార్పులు చేస్తున్నట్టు కమిటీ వెల్లడి 

ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఈ నెల 28న ఆవిష్కరించనున్న ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం కొనసాగుతోంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెలకొల్పుతున్న ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. దీనిని యాదవ సంఘాలు తప్పపడుతున్నాయి. ఎన్టీఆర్ సాధారణ రూపంలోనే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇస్కాన్ సహా16 మంది హైకోర్టును ఆశ్రయించారు. స్వల్ప మార్పులు చేస్తూ దానినే ప్రతిష్టించేందుకు నిర్వాహకులు రెడీ అవుతుండగా యాదవ సంఘాలు మాత్రం అడ్డుకొని తీరుతామంటున్నాయి. 

ఖమ్మం : దివంగత సీఎం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై రూ. 4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న 54 అడుగుల భారీ విగ్రహం చుట్టూ వివాదం నెలకొంది. కమ్మ సంఘం, తానా, పలువురు స్థానిక పారిశ్రామిక వేత్తలు ఒక కమిటీగా ఏర్పడి శ్రీ కృష్ణుడి గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సిద్ధం చేశాయి. ఈ నెల 28న ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నాయి. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని నిర్వాహకులు భావించారు. మంత్రి పువ్వాడ అజయ్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీ కృష్ణుడి గెటప్ లో ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘాలు తప్పుపడుతున్నాయి. శ్రీ కృష్ణుడు తమ ఆరాధ్య దైవమంటున్నాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడం వల్ల భావి తరాలు ఎన్టీఆరే శ్రీ కృష్ణుడు అని భావించే అవకాశం ఉందని, దానిని తక్షణం ఆపేయాలని యాదవ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇస్కాన్ సైతం యాదవ సంఘాలకు మద్దతుగా నిలిచింది. అయితే తాము దానవీర శూర కర్ణ సినిమాలో శ్రీ కృష్ణుడి పాత్రదారిగా నటించిన ఎన్టీఆర్ ఫొటో ఆధారంగానే విగ్రహం తయారు చేయించామని, చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ఇలానే ఉన్నాయని కమ్మ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఒక్క విగ్రహం విషయంలోనే రాద్ధాంతం తగదంటున్నారు. 

హైకోర్టులో 16 పిటిషన్లు

ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఆపాలని కోరుతూ హైకోర్టులో 16 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇస్కాన్, కరాటే కల్యాణి నేతృత్వంలోని ఆదిభట్ట కళాపీఠం, యాదవ సంఘాలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై స్పందించిన నిర్వాహకులు విగ్రహంలో మార్పులు చేపట్టారు. నీలమేఘ శ్యాముడిగా ఉన్న శ్రీకృష్ణుడి గెటప్ ను గోల్డ్ కలర్ లోకి మార్చుతున్నారు. విగ్రహానికి ఉన్న నెమలి పింఛాన్ని తొలగించారు. కిరీటం వెనుక వైపున ఉన్న విష్ణుచక్రాన్ని, చేతిలో ఉన్న పిల్లన గ్రోవిని తొలగిస్తున్నారు. యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని హైకోర్టుకు విన్నవిస్తామని అంటున్నారు. ఈ నెల 28న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని కూడా వారు చెబుతున్నారు.