
హైదరాబాద్సిటీ, వెలుగు: వేసవి సెలవులకు తిరుపతి వెళ్లే యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చర్లపల్లి, తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. వచ్చే నెల 7 నుంచి జూన్25వ తేదీ వరకు చర్లపల్లి నుంచి 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. ప్రతిరోజూ సాయంత్రం 6.50 గంటలకు స్పెషల్ట్రైన్ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వెల్లడించింది.
అలాగే మే 8 నుంచి స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4.55 గంటలకు స్పెషల్ట్రైన్తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని తెలిపారు. ఈ రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని స్పష్టం చేశారు.1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్కోచ్ లు అందుబాటులో ఉంటాయన్నారు.
జూన్6 వరకు రైళ్ల పొడిగింపు
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ–నాగర్కోయిల్మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. వచ్చే నెల 9 నుంచి జూన్6వ వరకు కాచిగూడ నుంచి నాగర్ కోయిల్ కు ఐదు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. నాగర్ కోయిల్నుంచి కాచిగూడకు మే11 నుంచి జూన్8వ తేదీ వరకు ఐదు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.