- మిల్లర్ల దగ్గర రూ.11 వేల కోట్లు, బిడ్డర్ల దగ్గర రూ.5 వేల కోట్ల ధాన్యం పెండింగ్
- గడువు ముగిసినా సివిల్ సప్లయ్స్ శాఖకు అందని బకాయిలు
- రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్నా ఆశించిన ఫలితం ఉండట్లే
- సీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్‌తో మిల్లర్లకు కళ్లెం వేయాలని సర్కార్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొందరు మిల్లర్లు, బిడ్డర్లు తోడుదొంగల్లా మారారు. ఏకంగా రూ.16 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని తమ దగ్గర పెట్టుకొని బకాయిలు చెల్లించకుండా డ్రామాలు ఆడుతున్నారు. సివిల్ సప్లయ్స్ శాఖ రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్‌కు ఇస్తే, వాటిని బియ్యంగా మార్చి సకాలంలో ఇవ్వాల్సిన మిల్లర్లు ఏండ్లకు ఏండ్లు పెండింగ్ పెడ్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం వల్ల మొన్నటి యాసంగి సీజన్‌వరకు మిల్లర్ల వద్ద దాదాపు రూ.11వేల కోట్ల విలువైన ధాన్యం పేరుకుపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సివిల్సప్లయ్స్ అధికారులతో దాడులు చేయిస్తే, మెజారిటీ మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టు తేలింది.
దీంతో కేసులు పెట్టి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి, ఆస్తులను సీజ్ చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇలాగైతే లాభం లేదని 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించిన రూ.7 వేల కోట్ల విలువైన 35 లక్షల టన్నుల వడ్లను టెండర్ల ద్వారా బిడ్లర్లకు అమ్మితే... గడువు ముగిసినా ధాన్యాన్ని తీసుకెళ్లకుండా, బకాయిలు చెల్లించకుండా తిప్పుకుంటున్నారు.సివిల్ సప్లయ్స్శాఖ ప్రతి సీజన్లో బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకొని రైతుల నుంచి వడ్లు సేకరిస్తున్నది. ఇలా కొనుగోలు చేసిన వడ్లను మిల్లర్లకు ఇచ్చి, వారు మరాడించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి లెవీ పెడ్తుంది. ఎఫ్‌సీఐ నుంచే రేషన్‌షాపుల ద్వారా పేదలకు ఉచిత బియ్యం అందుతాయి.
అయితే బీఆర్ఎస్హయాంలో మిల్లర్లపై పర్యవేక్షణ కరువై ‘వాళ్లు ఆడింది ఆట.. పాడింది పాట’ అన్నట్టుగా మారింది. ఎలాంటి బ్యాంక్గ్యారంటీ లేకుండా, కనీసం మిల్లులు ఉన్నాయో లేదో వెరిఫై చేయకుండా వ్యాపారులు, మిల్లర్లకు భారీ మొత్తంలో వడ్లను అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కేటాయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది మిల్లర్లు, వ్యాపారులు వడ్లను మిల్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకున్నారు. అలా వచ్చిన డబ్బును కొందరు రియల్ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. చాలా జిల్లాల్లో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మిల్లర్లతో కుమ్మక్కై ఒక్కో మిల్లర్వద్ద రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
కొందరు అధికారులు సైతం చేతివాటం ప్రదర్శిస్తూ సీఎంఆర్‌పై నిర్లక్ష్యం వహించడం వల్లే సీజన్ల కొద్దీ సీఎంఆర్పెండింగ్పడిపోయి వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. 2014 నుంచి గత తొమ్మిదేండ్లలో మిల్లర్ల వద్ద దాదాపు రూ.11వేల కోట్లకు పైగా విలువైన ధాన్యం ఇప్పటికీ పెండింగ్ఉన్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఆయా మిల్లుల్లో వడ్లు లేకపోవడంతో ఇక సర్కార్ రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను నమ్ముకుంది. రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్ ఇవ్వని మిల్లర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టి, ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తున్నది.
పలువురు మిల్లర్ల స్థిర, చరాస్తులను సీజ్‌చేసి వేలం వేస్తున్నా.. వాళ్లకు కేటాయించిన మొత్తంలో సగం కూడా రావడం లేదని సివిల్సప్లయ్స్ ఆఫీసర్లు వాపోతున్నారు. ఉదాహరణకు మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన శ్రీధర్‌గుప్తా అనే రైస్మిల్లర్రూ.47 కోట్ల విలువైన సీఎంఆర్ధాన్యం బకా యిపడగా.. బుధవారం ఆయనకు చెందిన 1.31 ఎకరాలను వేలం వేస్తే వచ్చినవి 2.12 కోట్లు మాత్రమే.
కొత్త గైడ్ లైన్స్ తోనే మిల్లర్లకు కళ్లెం
గత బీఆర్ఎస్సర్కార్ నిర్వాకం వల్ల గడిచిన తొమ్మిదేండ్లలో సివిల్సప్లయ్స్ శాఖ రూ.58 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ లోన్లకు ఏటా రూ.3,645.25 కోట్ల వడ్డీలు కడుతున్నది. అప్పట్లో పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల అవినీతికి తోడు బ్యాంకు ష్యూరిటీలు తీసుకోకుండా మిల్లర్లకు వడ్లను ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్సర్కార్ గుర్తించింది. మిల్లర్లకు ఎలాంటి షరతుల్లేకుండా వడ్లను ఇచ్చి, ఆ తర్వాత బాధపడితే లాభముండదని.. ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలని నిర్ణయానికి వచ్చింది.
ఈ క్రమంలోనే సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ అధికారులు సీఎంఆర్‌కు సంబంధించి కొత్త గైడ్‌లైన్స్ రూపొందిస్తున్నారు. ఈ వానకాలం సీజన్‌నుంచి మిల్లులు, వాటి కెపాసిటీ ఆధారంగానే ధాన్యం కేటాయించనున్నారు. అలాగే గతంలో ధాన్యం తీసుకొని బియ్యం ఇవ్వకుండా డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లను ఈసారి పూర్తిగా పక్కనపెట్టాలని నిర్ణయించారు. సీఎంఆర్‌కు కేటాయించిన వడ్లకు బ్యాంక్గ్యారంటీ తప్పనిసరి చేయనున్నారు. ఇక అధికారుల తనిఖీల్లో వడ్లు తక్కువగా ఉన్నట్టు తేలితే క్రిమినల్‌చర్యలు తీసుకునేలా కఠిన నిబంధనలు రూపొందిస్తున్నారు.
మిల్లర్ల బాటలోనే బిడ్డర్లు
2022–23 యాసంగిలో రైతుల నుంచి సివిల్ సప్లయ్స్ శాఖ 66.84 లక్షల టన్నుల వడ్లను సేకరించింది. మిల్లింగ్‌చేసే పరిస్థితి లేకపోవడంతో అప్పటి బీఆర్ఎస్సర్కార్ దాదాపు సగం ధాన్యాన్ని అమ్మకానికి పెట్టింది. ఆ తర్వాత అధికారం కోల్పోవడంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేసి.. గత జనవరి 25న 35 లక్షల టన్నుల వడ్లకు కొత్త టెండర్లు పిలిచింది. బిడ్‌లు దాఖలు చేసిన 26 కంపెనీలకు ఈ ధాన్యాన్ని అప్పగించారు. వీరంతా మిల్లర్ల నుంచి ధాన్యం తీసుకుని రూ.7వేల కోట్లను సివిల్ సప్లయ్స్‌కు చెల్లించాల్సి ఉంది. సెప్టెంబరు 23కు గడువు ముగిసినా ఇప్పటి వరకు బిడ్డర్లు కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే సివిల్ సప్లయ్స్‌కు చెల్లించారు. ఇంకా రూ.5వేల కోట్లు పెండింగ్‌పడ్డాయి.