ప్రేమికుడి ఫిర్యాదుతో నెల రోజుల తర్వాత వెలుగులోకి
దైవదర్శనానికని చెప్పి తీసుకెళ్లి హత్య
రాజస్థాన్ లోని పాలి జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడిని ప్రేమించిన పాపానికి 16 ఏళ్ల బాలిక పరువు హత్యకు గురైంది. ప్రేమికుడి ఫిర్యాదుతో బాలికను చంపిన ఘటన నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. బాలికను హత్య చేసిన తల్లిని మరియు ఆమె బాబాయిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పాలి జిల్లాలోని సోనాయ్ గ్రామానికి చెందిన శేషారం మరియు సవారాం కుటుంబాలు చాలా కాలం క్రితం పూణేకు వలస వచ్చారు. అక్కడ ఇరుకుటుంబాలు కలిసి కిరాణా షాపును నడుపుతున్నాయి. శేషారం కుమార్తె రింకు పూణేలోని ఒక స్థానిక యువకుడిని ప్రేమించింది. రెండు నెలల క్రితం రింకు.. ఆ యువకుడితో కలిసి పారిపోయింది. రింకును ఆ యువకుడు కిడ్నాప్ చేశాడని రింకు కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల తర్వాత రింకు మరియు ఆమె బాయ్ ఫ్రెండును ముంబై పోలీసులు దంపర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నారు. రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ముంబైకి వెళ్లి వారిని రాజస్థాన్ తీసుకువచ్చారు. రింకు మైనర్ కావడంతో ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. యువకుడిని మాత్రం అరెస్టు చేశారు. ఒక నెల తరువాత ఆ యువకుడు బెయిల్ పై విడుదలై బయటకు వచ్చాడు. అప్పుడు కూడా రింకు.. ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. దానికి ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దాంతో రింకును ఆమె కుటుంబసభ్యులు గ్రామ దేవతను దర్శించుకోవాలని చెప్పి మార్చి 18న రాజస్థాన్ లోని వారి గ్రామానికి తీసుకువచ్చారు. ఆ మరుసటి రోజు, మార్చి 19న, రింకును ఆమె తల్లి సీతాదేవి, బాబాయి సవారం కలిసి గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత రింకు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. తమకేం తెలియదన్నట్లు వారిద్దరూ తిరిగి పూణేకు వచ్చారు.
రింకు కనిపించకపోవడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు రింకు కుటుంబసభ్యులను విచారణ చేయగా.. ఆమెను గ్రామానికి తీసుకెళ్లి చంపేసినట్లు రింకు తల్లి, ఆమె బాబాయి సవరం ఒప్పుకున్నారని పాలి పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ కోటోకి తెలిపారు. ‘వారిచ్చిన వాంగ్మూలం ప్రకారం.. రింకు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. బాలికను పరువు హత్య చేసిన తల్లిని మరియు బాబాయిని అరెస్టు చేశాం. అంతేకాకుండా.. ఇతర కుటుంబసభ్యుల పాత్రపై కూడా దర్యప్తు చేస్తున్నాం’ అని పాలి పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ కోటోకి తెలిపారు.
For More News..