16 ఏళ్ల బాలికను.. నడిరోడ్డుపై చంపుతుంటే.. సినిమా చూసినట్లు చూశారు

ఢిల్లీలో ఏం జరుగుతోంది.. ఈ ఘటన తర్వాత ఇదే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. 2023, మే 28వ తేదీ రాత్రి జరిగిన హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీలోని షహబాద్ ఏరియా ప్రాంతంలో.. సాక్షి అనే 16 ఏళ్ల అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంది.అదే సమయంలో అమ్మాయి సాక్షిని అడ్డుకుంటాడు సాహిల్ అనే యువకుడు. వీళ్లిద్దరి మధ్య గతంలోనే పరిచయం ఉండటంతో.. వాగ్వాదం జరుగుతుంది. ఆ తర్వాత విచక్షణ కోల్పోయిన సాహిల్.. 16 ఏళ్ల సాక్షిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. 

ఆవేశంతో ఊగిపోయిన సాహిల్.. అమ్మాయి సాక్షిని నడిరోడ్డుపైనే.. కత్తితో 20 సార్లు పొడుస్తాడు. అప్పటికీ కసి తీరకపోవటంతో.. రోడ్డుపై ఉన్న బండ రాయి తీసుకుని అమ్మాయి ముఖంపై పలుమార్లు కొడతాడు. తీవ్రగాయాలతో సాక్షి అక్కడికక్కడే చనిపోయింది. సాహిల్.. అమ్మాయి సాక్షిపై దాడి చేస్తున్న సమయంలో వీధిలోని వాళ్లందరూ సినిమా చూసినట్లు చూశారు.. ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.. ఇదంతా ఆ వీధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. 

మే 28వ తేదీ రాత్రి అమ్మాయి సాక్షి.. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. దారి మధ్యలో అడ్డగించిన సాహిల్.. అమ్మాయిపై దాడి చేసి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎక్కడో.. ఏ నిర్మానుష్యమైన ప్రాంతంలోనూ ఇలాంటి ఘటన జరిగితే.. ఎవరూ లేరని అనుకోవచ్చు.. నడిరోడ్డుపై.. రద్దీగా ఉండే వీధిలో ఓ అమ్మాయిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడుస్తున్నా.. రాయితో కొడుతున్నా ఒక్కరు అంటే ఒక్కరు కూడా అడ్డుకోకపోగా.. మనకు ఎందుకులే అంటూ చూస్తూ ఉండిపోయారు స్థానికులు. మరికొందరు ఈ ప్రాంతం నుంచి పరుగులు తీయటం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

బాలిక సాక్షిని చంపిన తర్వాత సాహిల్ అక్కడి నుంచి పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు పోలీసులు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.