గుంటూరు జిల్లా దారుణం జరిగింది. రాత్రి ఇంట్లో పడుకున్న యువతి తెల్లారేసరికి హత్యకు గురయింది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన లక్కన తనూష (16) అనే యువతి శుక్రవారం రాత్రి దారుణంగా హత్య చేయబడింది.
నరసరావుపేటలోని లింగంగుంట్ల కాలనీలో లక్కన చిన్న బసవయ్య తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతడు పట్టణంలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నాడు. చిన్నబసవయ్య కుటుంబం శుక్రవారం ఆయన అత్తగారి ఊరైన తిరువూరులో బంధువుల ఇంట్లో పెద్దకర్మ కార్యక్రమానికి వెళ్ళారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే బసవయ్య కుమార్తె లక్కన తనూష, కుమారుడు కుమారస్వామి ఇద్దరూ రాత్రి 8 గంటలకు నరసరావుపేట చేరుకున్నారు. అయితే ఏమైందో తెలియదు గాని తెల్లవారే సరికి తనూష శవమై కనిపించింది.
ఆమె సోదరుడు కుమారస్వామి ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కుమారస్వామిని విచారించగా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంట్లోకి ప్రవేశించి తనపై, తన సోదరిపై దాడి చేశారని కుమారస్వామి తెలిపాడు. ఆ దాడిలో తన సోదరి మృతి చెందిందని పోలీసులకు తెలియజేశాడు.
అయితే క్లూస్ టీం రాకతో ఈ హత్య ఘటన కొత్త మలుపు తిరిగింది. పోలీసులు, క్లూస్ టీం విచారణలో ఆ ఇంటి పరిసరాలలోకి కొత్త వ్యక్తులు వచ్చిన ఆనవాళ్ళు ఏమీ లభించలేదని తెలిసింది. క్లూస్ టీం తీసుకొచ్చిన స్నిఫర్ డాగ్ కూడా మృతురాలి సోదరుడు కుమార స్వామి వద్దకే వెళుతుందని చెప్పడంతో ఈ హత్య కేసులో అతనిపై అనుమానాలు బలపడ్డాయి. దాంతో కుమారస్వామిని నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
For More News..