ఎట్టకేలకు భర్తీ దిశగా విద్యుత్  డైరెక్టర్ పోస్టులు

ఎట్టకేలకు భర్తీ దిశగా విద్యుత్  డైరెక్టర్ పోస్టులు
  •  జెన్​కో, ట్రాన్స్​కో డైరెక్టర్ పోస్టులకు 160 అప్లికేషన్లు
  •  ఒక్కోపోస్టుకు 20 మంది దరఖాస్తు
  •  త్వరలో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్  ఉత్పత్తి సంస్థల్లో ఖాళీగా ఉన్న 8  డైరెక్టర్  పోస్టుల భర్తీకి ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఈ పోస్టుల భర్తీకి త్వరలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఏడాదికి పైగా ఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌‌చార్జీల పాలనలో కొనసాగుతున్నాయి. దీంతో వీటి భర్తీకి విద్యుత్  సంస్థలు ఇచ్చిన నోటిఫికేషన్‌‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఎనిమిది పోస్టులకు సగటున 20 మంది అప్లయ్​ చేసుకున్నారు. మొత్తం 160 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ పోస్టులకు చీఫ్  ఇంజినీర్లు, చీఫ్  జనరల్  మేనేజర్లు, కొంత మంది ప్రస్తుత డైరెక్టర్లు సైతం పోటీ పడుతున్నారు. అనుభవం,  విషయ నైపుణ్యంతో పాటు పనితీరు ఆధారంగా ప్రతి పదవికి ముగ్గురు అభ్యర్థులను మాత్రమే షార్ట్‌‌లిస్ట్  చేయనున్నారు. ఈ ఎనిమిది పోస్టుల్లో జెన్కోలో ఐదు డైరెక్టర్​ పోస్టులు కాగా వాటిలో- డైరెక్టర్ (హైడల్), డైరెక్టర్ (హెచ్ఆర్ అండ్​ ఐఆర్), డైరెక్టర్ (కోల్, లాజిస్టిక్స్), డైరెక్టర్ (ఫైనాన్స్, కమర్షియల్) పోస్టులు ఉన్నాయి. అలాగే, ట్రాన్స్ కోలో మూడు -డైరెక్టర్  పోస్టుల్లో డైరెక్టర్​(గ్రిడ్, ట్రాన్స్ మిషన్, మేనేజ్మెంట్), డైరెక్టర్ (ప్రాజెక్ట్స్),  డైరెక్టర్ (ఫైనాన్స్) పోస్టులు ఉన్నాయి.