కాకతీయ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్  నాలా అభివృద్ధికి రూ.160 కోట్లు

కాకతీయ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్  నాలా అభివృద్ధికి రూ.160 కోట్లు

హైదరాబాద్, వెలుగు: వరంగల్‌‌‌‌‌‌‌‌లోని కాకతీయ మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్  పార్క్ (కేఎంటీపీ) లోని నాలా నుంచి వరద ముప్పును తగ్గించే పనుల కోసం ప్రభుత్వం రూ.160.92 కోట్లను మంజూరు చేసింది. ఐటీ, పరిశ్రమల శాఖ  ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పనుల్లో భాగంగా రిటెయినింగ్  వాల్  నిర్మాణానికి రూ.132.28 కోట్లు, ఇతర పనులకు 4.13 కోట్లు కేటాయించగా.. ఆ మొత్తం ఖర్చులో జీఎస్టీకే రూ.24.54 కోట్లు అయ్యాయి. పీఎం మిత్ర స్కీమ్‌‌‌‌‌‌‌‌లో నాలా స్ట్రెంతెనింగ్  పనులు రావని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో.. రాష్ట్ర సర్కారే నిధులు మంజూరు చేసింది.‌‌‌‌‌‌‌‌

సీఎం రేవంత్​కు మంత్రి సురేఖ కృతజ్ఞతలు 
కాకతీయ మెగా టెక్స్ టైల్  పార్కుకు వరద ముంపు నివారణ పనుల నిమిత్తం మరో రూ.160.92 కోట్లు విడుదల  చేయడం కాంగ్రెస్  ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి కొండా సురేఖ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన కాకతీయ మెగా టెక్స్ టైల్  పార్కు భూ నిర్వాసితులకు  863 ఇండ్లను మంజూరు చేసినందుకు సీఎంకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి వరంగల్  జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. తన ప్రతిపాదనలను పెద్ద మనసుతో ఆమోదించి, రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్   నగరాన్ని తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. అలాగే, మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి రూ.205 కోట్లను విడుదల చేస్తూ జీఓ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మామునూరు ఎయిర్ పోర్టు   ఏర్పాటు మైలురాయిగా నిలుస్తుందన్నారు.  

‘వరంగల్’ టవర్స్​కు రూ. 32 కోట్లు   
వరంగ‌‌‌‌ల్ అభివృద్ధికి వడివడిగా అడుగులు ప‌‌‌‌డుతున్నాయి. రాష్ట్ర రెండో రాజ‌‌‌‌ధానిగా వ‌‌‌‌రంగ‌‌‌‌ల్‌‌‌‌ను తీర్చిదిద్దాల‌‌‌‌నే ల‌‌‌‌క్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప‌‌‌‌లు పెండింగ్ ప్రాజెక్టుల‌‌‌‌ను ముందుకు తీసుకెళ్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​కు పరిపాలన భవనం నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం రూ.32.50 కోట్లకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టవర్స్ ఆఫ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తోనే ఆయా పనులను ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగానే 8.30 కిలోమీట‌‌‌‌ర్ల ఇన్నర్ రింగ్ రోడ్డుకు రూ.80 కోట్ల పరిపాలన అనుమతులు ఇస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు హామి ఇచ్చారు. రూ.50 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అంత మొత్తం సరిపోదని ఇంకా కొంత పెంచాలని కోరుతూ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) గత ప్రభుత్వంలోనే లేఖరాసింది. ఇప్పుడు దానికి అనుగుణంగా మరో రూ.30 కోట్లు పెంచుతూ కుడాకు సర్కారు అనుమతి ఇచ్చింది.