- సీఆర్పీఎఫ్ ఆధీనంలోకి పోలింగ్ సెంటర్లు
- మూడంచెల భద్రత, సీసీ టీవీ కెమెరాలతో నిఘా
- కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్
హైదరాబాద్,వెలుగు : పోలింగ్ సందర్భంగా సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఓల్డ్ సిటీతో పాటు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రేటర్ సిటీలో 1,642 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ఆయా సెంటర్ల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. ఇందులో సిటీలోనే అధికంగా1, 046 కేంద్రాలు ఉండగా.. సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.
హై డెఫినేషన్ సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేశారు. ఇప్పటికే.. సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి వరుస సమావేశాలు నిర్వహిచారు. డీసీపీ అధికారి నుంచి లోకల్ పోలీస్ స్టేషన్ దాకా మానిటరింగ్ చేస్తున్నారు. దాదాపు 30 వేలకుపైగా పోలీసులను నియమించారు. డీఆర్సీ సెంటర్స్ నుంచి ఈవీఎంలను ట్రాక్ చేసేందుకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
144 సెక్షన్ అమలు
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. క్రిటికల్ సెంటర్లలో మైక్రో అబ్జర్వర్స్,సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్‌ను మోహరించారు. రెండంచెల్లో కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయి. కేంద్రానికి100 మీటర్ల దూరంలో ఓటర్లను మినహా ఇతరులను అనుమతించరు. ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద మహిళా కానిస్టేబుల్ ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు కొనసాగిస్తారు. కమ్యూనికేషన్ కు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. గొడవలు చెయ్యాలని యత్నించే వారిపై నిఘా పెట్టారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.