రాష్ట్రవ్యాప్తంగా 1,662 మంది రెస్క్యూ

రాష్ట్రవ్యాప్తంగా 1,662 మంది రెస్క్యూ
  • ఖమ్మం జిల్లాలో 761 మందిని కాపాడిన ఫైర్ డిపార్ట్‌‌‌‌మెంట్
  • మూడు మృతదేహాల వెలికితీత

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 1,662 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని వందల మంది చిక్కుకున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 1,662 మందిని రెస్క్యూ చేశారు. వరద నీటిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.

ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా 761 మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫైర్  సర్వీసెస్‌‌‌‌  చేస్తున్న ఆపరేషన్ల వివరాలను అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి సోమవారం వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని, అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైందని ఆయన తెలిపారు.

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో స్థానిక అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందితో పాటు అగ్నిమాపక శాఖకు సంబంధించిన స్టేట్‌‌‌‌  డిజాస్టర్‌‌‌‌  రెస్పాన్స్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నదని చెప్పారు. ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌‌‌‌, నల్లగొండ, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌, సంగారెడ్డి, హన్మకొండ, ఖమ్మం ప్రాంతాల్లో  11 రెస్క్యూ బోట్లతో వంద మంది ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని నాగిరెడ్డి వివరించారు.