
- 1,672 మందికి శాంక్షన్ అర్డర్ 262 ఇండ్ల నిర్మాణంకు మార్కవుట్
కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా 25 గ్రామాల్లో 2,396 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, వీరిలో 1,672 మందికి శాంక్షన్ ఆర్డర్లు జారీ చేశారు. అలాగే, 262 ఇండ్ల నిర్మాణానికి మార్కవుట్ ఇచ్చారు. లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇండ్ల కోసం జిల్లాలో మొత్తం 1,03,342 దరఖాస్తులు రాగా, వీటిలో 84,000 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెరిఫై చేశారు. అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేసి, వారికి సొంత స్థలం ఉందా, లేదా, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి పరిస్థితి ఎలా ఉంది వంటి సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, జనవరి 26న ఈ గ్రామాల్లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఎంపిక చేసిన గ్రామాల్లో పనులు ప్రారంభం
జిల్లాలోని 25 గ్రామాలను మండలానికి ఒకటి చొప్పున ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తూ 2,396 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరిలో 1,672 మందికి శాంక్షన్ ఆర్డర్లు జారీ చేయగా, 262 మందికి మార్కవుట్ పూర్తయింది. మిగిలిన లబ్ధిదారులు ఉగాది తర్వాత మార్కవుట్ చేయాలని అధికారులకు తెలిపారు. మార్కవుట్ జరిగిన వారు నిర్మాణ పనులు ప్రారంభించాలని, ప్రస్తుతం పునాదుల తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు సూచించారు. మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు ఈ పనులను నిరంతరం పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరా కోసం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అందుబాటులో ఉన్న ఇసుక రీచ్‌లు, వాటి నుంచి ఎంత ఇసుక లభ్యమవుతుంది, లబ్ధిదారులకు ఇసుక తీసుకునేందుకు అనుమతుల విషయంలో సూచనలు ఇచ్చారు. సమీపంలోని వాగుల నుంచి ఇసుక సేకరణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. హౌసింగ్, జడ్పీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. బిల్లులను విడతలవారీగా చెల్లిస్తామని లబ్ధిదారులకు తెలిపారు.
లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవగాహన కల్పిస్తున్నాం. మార్కవుట్ ఇచ్చే ప్రక్రియతో పాటు, అధికారులు, స్థానిక కార్యదర్శులు లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు 262 మందికి మార్కవుట్ ఇచ్చాం. మిగిలిన వారికి కూడా మార్కవుట్ ఇచ్చి, నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూస్తున్నాం,
విక్టర్, అడిషనల్ కలెక్టర్