హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ సేల్ జోరుగా సాగింది. గత వారం రోజులుగా మద్యం నిల్వలు పెట్టుకున్న వైన్స్‌లు, బార్లు స్టాక్‌ను పూర్తిగా అమ్మేసుకున్నాయి. మద్యం డిపోల నుంచి డిసెంబర్ 23వ తేదీ నుంచి 31 వరకు రూ.1,694 కోట్ల విలువైన మద్యం సప్లై కాగా.. ఆ మొత్తం సేల్ అయింది. ప్రతి రోజు యావరేజ్‌గా రూ.200 కోట్ల విలువైన లిక్కర్ సరఫరా జరిగింది.
దీంతో ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.3,805 కోట్ల విలువైన 38.07 లక్షల లిక్కర్ కేసులు, 45.09 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్టు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఏకంగా రూ.37,682 కోట్ల విలువైన 3.76 కోట్ల లిక్కర్ కేసులు, 5.47 కోట్ల కేసుల బీర్లు సేల్ అయ్యాయి.రెండు ఆదివారాలు, ఒక క్రిస్మస్.. 3 సెలవు రోజులు మినహా మిగిలిన 7 రోజులు డిపోల నుంచి కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. నిరుడు డిసెంబర్ 22వ తేదీ నుంచి 31 వరకు జరిగిన అమ్మకాలు రూ.1,510 కోట్లని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా దాదాపు 200 కోట్ల ఆదాయం అదనంగా సమకూరిందని అధికారులు తెలిపారు.
అనుమతులతో ఎక్సైజ్ శాఖకు రూ. 56.46 లక్షలు
ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 31న ప్రత్యేక ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది. దీంతో రూ. 56.48 లక్షల రాబడి వచ్చింది. మొత్తం 287 ఈవెంట్స్ కు ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 243 అనుమతులు ఇవ్వగా.. మిగిలిన జిల్లాల్లో 44 పర్మిషన్స్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా జరిగిన సంబురాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఎక్సైజ్ శాఖ 40 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగిన దాడుల్లో 4 కేసులు నమోదు చేశారు. 2 చోట్ల గంజాయి పట్టుకోవడంతోపాటు ఒక పబ్బు పరిసర ప్రాంతాల్లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తో పాటు 17 మంది అధికారులు పర్యవేక్షించారు. రెండు చోట్ల 313 గ్రాములు, 3.313 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు.
రాష్ట్రంలో లిక్కర్ సేల్ వివరాలు
తేదీ అమ్మకం (రూ. కోట్లలో)
డిసెంబర్ 23 193
డిసెంబర్ 24 197
డిసెంబర్ 26 191
డిసెంబర్ 27 187
డిసెంబర్ 28 242
డిసెంబర్ 30 402.64
డిసెంబర్ 31 282
మొత్తం 1,694