
గాంధీ నగర్: గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బనస్కాంత జిల్లా దీసా పట్టణానికి సమీపంలో ఉన్న ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో మంగళవారం (ఏప్రిల్ 1) భారీ పేలుడు సంభవించింది. దీంతో గోడౌన్లో పని చేస్తోన్న 17 మంది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ కొంత మేర కూలిపోగా.. పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో బయటకు పరుగులు పెట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల సహయక బృందాలు చర్యలు చేపట్టాయి. పోలీసులు, ఇతర విభాగాల సిబ్బంది ఘటన స్థలంలోనే ఉండి సహయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై బనస్కాంత జిల్లా కలెక్టర్ మిహిర్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు (ఏప్రిల్ 1) ఉదయం దీసాలోని పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద పేలుడు సంభవించినట్లు మాకు సమాచారం అందింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది కార్మికులు మరణించారు.
ALSO READ : ‘మీరట్ మర్డర్ గుర్తుందా.. మాకు అడ్డొస్తే నీకూ అదే గతి’.. భార్య వార్నింగ్ వీడియో వైరల్..!
గాయపడిన కార్మికులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. పేలుడు చాలా పెద్దది కావడంతో ఫ్యాక్టరీ స్లాబ్ కూలిపోయింది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారా అన్న అనుమానంతో సహయక చర్యలు చేపట్టాం’’ అని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.