![17మందిని పొట్టనబెట్టుకున్న డ్రైవర్ నిర్లక్ష్యం.. ఓవర్ లోడ్ తో చెరువులో మునిగింది](https://static.v6velugu.com/uploads/2023/07/Bangladesh-After-Bus_e8R5uaKiLw.jpg)
బంగ్లాదేశ్‌లోని ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో బస్సు చెరువులో పడిపోవడంతో ముగ్గురు చిన్నారులు సహా 17 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 35 మంది గాయపడినట్లు ది డైలీ స్టార్ తెలిపింది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. బస్సులో ప్రయాణీకులు అధికంగా ఉండడం వల్లే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని వారు తెలిపారు.
బరిషల్ వెళ్లే బస్సు, దాని కెపాసిటీ 52కి మించి 60 మంది ప్రయాణికులను ఎక్కించుకుని, జూలై 22న ఉదయం 9:00 గంటలకు పిరోజ్‌పూర్‌లోని భండారియా నుంచి బయలుదేరి, ఉదయం 10:00 గంటలకు బరిషల్-ఖుల్నా హైవేపై ఛత్రకాండలోని రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోయింది.
"నేను భండారియాలో బస్సు ఎక్కాను. బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. వారిలో కొందరు ఫుట్ బోర్డ్ పై నిలబడి ఉన్నారు. అప్పుడే అకస్మాత్తుగా, బస్సు పడిపోయింది" అని ప్రాణాలతో బయటపడిన ఎండీ మోమిన్ చెప్పారు. "ప్రయాణికులందరూ బస్సులో చిక్కుకున్నారు. ఓవర్‌లోడ్ కావడంతో, బస్సు వెంటనే మునిగిపోయింది. నేను ఎలాగోలా బస్సు నుంచి బయటకు రాగలిగాను" అని తెలిపారు.
ఈ ఘటనలో మొత్తం 17 మంది అక్కడికక్కడే మరణించారని, మిగిలిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని బరిషల్ డివిజనల్ కమిషనర్ ఎండీ షౌకత్ అలీ ధృవీకరించినట్లు ది డైలీ స్టార్ తెలిపింది. బాధితుల్లో ఎక్కువ మంది పిరోజ్‌పూర్‌లోని భండారియా ఉపజిల్లా, ఝల్‌కతీలోని రాజాపూర్ ప్రాంతంలోని నివాసితులని పోలీసులు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ (RSF) ప్రకారం, ఒక్క జూన్ నెలలోనే మొత్తం 559 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 812 మంది గాయపడ్డారు.