
- రాష్ట్రంలో జరుగుతున్న పెళ్లిళ్లలో 17% చైల్డ్ మ్యారేజెస్
- నాలుగేళ్లలో మూడు వేలకుపైగా పెళ్లిళ్లకు బ్రేక్
- చైల్డ్ హెల్ప్ లైన్1098కు వస్తున్న కాల్స్‌లో ఇవే ఎక్కువ
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలున్నా పెద్దోళ్లు డోంట్ కేర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చిన్నారి పెండ్లికూతుళ్ల సంఖ్య ఇంకా తగ్గడం లేదు. అవగాహన లేక కొందరు పెద్దోళ్లు.. త్వరగా పెండ్లి చేసి బరువు దించుకోవాలని మరికొందరు పెద్దోళ్లు.. ఈడు రాకముందే చిన్నారి తల్లులను జోడు కట్టించి అత్తారింటికి పంపుతున్నరు. పద్దెనిమిదేండ్లు నిండక ముందే మ్యారేజ్ చేస్తే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లాంటి స్కీమ్‌లకు అర్హులు కారని తెలిసినా పెద్దోళ్లు పట్టించుకోవడం లేదు. త్వరగా పెళ్లి చేయడమే తమకు పది లక్షలు అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. బాల్య వివాహాలను ఆపాలంటూ గత మూడేళ్లలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు 3,414 కాల్స్ వచ్చాయంటే రాష్ట్రంలో పరిస్థితి అద్దం పడుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకే 366 పెళ్లిళ్లను అధికారులు నిలిపివేయడం గమనించదగ్గ విషయం.
దేశ సగటు కంటే రాష్ట్రంలోనే ఎక్కువ..
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి వంద పెళ్లిళ్లలో 17 మంది వధువులకు ఈడు రాకముందే పెళ్లి చేస్తున్నారని ఇటీవలి నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదిక వెల్లడించింది. దేశ సగటు బాల్య వివాహాల సంఖ్య కంటే కూడా ఇది 0.3 శాతం ఎక్కువ. చైల్డ్ మ్యారేజెస్ 2016లో 16.8 శాతం ఉంటే, ఆ తర్వాత సంవత్సరం17 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే 18 నుంచి 20 ఏండ్ల వయసులోనే19.3 శాతం అమ్మాయిలకు వివాహాలు జరుగుతున్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. మొత్తంగా చూస్తే డిగ్రీ కూడా పూర్తి కాకుండానే 36.3 శాతం మంది అమ్మాయిల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చిన్న వయసులోనే కాన్పుల వల్ల బాలికలు, యువతుల్లో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
పాలమూరులోనే ఎక్కువ
జిల్లా కేంద్రాల్లో ఉన్న1098 చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్లకు 2015-–16లో 878, 2016–-17లో 1321, 2017–-18లో 1215 ఫోన్ కాల్స్ వచ్చాయి. పాలమూరు జిల్లాలో గత ఏడాది చైల్డ్ మ్యారేజేస్‌పై అత్యధికంగా 280 ఫిర్యాదులు రాగా, ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలోని చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్‌కు194, నల్లగొండ జిల్లా సెంటర్‌కు175 ఫిర్యాదులు వచ్చాయి. సికింద్రాబాద్ చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్‌కు మాత్రమే బాల్యవివాహాలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. అయితే హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నట్లు ఐసీడీఎస్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
పెండ్లిళ్లను ఆపినా మళ్లీ చేస్తున్నరు
ఫిర్యాదు అందగానే చైల్డ్ హెల్ప్ లైన్, ఐసీడీఎస్ సిబ్బంది, పోలీసులతో కలిసి వెళ్లి చాలా పెళ్లిళ్లను ఆపగలిగినప్పటికీ కొన్ని పెండ్లిళ్లు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నట్లు పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్న తరుణి స్వచ్చంద సంస్థ సెక్రటరీ మమతా రఘువీర్ పేర్కొన్నారు. చాలాసార్లు పెళ్ళిళ్ళ ను నిలిపివేసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ పెళ్లి నిశ్చయమైందనే కారణంతో కొద్ది రోజులకు మరో ముహూర్తంలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేస్తున్నారని చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తమకు సమాచారం లేకపోవడంతో మళ్లీ వెళ్లి ఆపలేకపోతున్నామని చెప్పారు. ఇలా జరిగిన పెళ్లిళ్లను రద్దు చేసే అవకాశం చట్టంలో లేక కూడా ఇబ్బందులొస్తున్నాయన్నారు.
చైల్డ్ మ్యారేజెస్‌కు కారణాలివే
- 54 శాతం బాల్య వివాహాలు ఏడు, ఎనిమిదో తరగతి వరకు చదివి మానేసిన బాలికలవే.
- పెళ్లి ఖర్చులు, వరకట్నం పెరుగుతుండటంతో తక్కువ కట్నం ఇచ్చినా చేసుకుంటామంటూ పెళ్లి సంబంధం వస్తే చేస్తున్నారు.
- కొందరు తల్లిదండ్రులు కూతురిని భారంగా భావిస్తున్నారు.
- టెన్త్ తర్వాత కాలేజీ చదువులకు అమ్మాయిలను దూరం పంపడం ఇష్టం లేనివారు, పై చదువులు చదివించే స్థోమత లేని తల్లిదండ్రులు పెళ్లి చేస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు.
- లైంగిక హింసకు గురైన బాలికలను ఎవరూ పెళ్లి చేసుకోరనే ఉద్దేశంతో త్వరగా పెళ్లి చేస్తున్నారు.
- ప్రేమ వ్యవహారాలు, పెళ్లికి ముందు సంబంధాలు, ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఘటనలు కూడా కారణమవుతున్నాయి.