
- సెల్ఫీ వీడియో తీసి మృతురాలి బంధువులకు షేరింగ్
- కుషాయిగూడ ఘటనలో బాలుడు అరెస్ట్
- ఈ నెల 11న ఘటన
హైదరాబాద్‌సిటీ, వెలుగు: హార్డ్వేర్షాప్లో పని చేస్తున్న ఓ బాలుడు.. వృద్ధురాలైన ఓనర్ ప్రతిసారీ పని చెప్తూ విసిగిస్తోందని ఆమెను హత్య చేశాడు. కుటుంబీకులు ఎవరూ లేని సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్లి రాడ్‌తో తల పగలగొట్టి చంపాడు. ఆపై కొద్దిసేపు వృద్ధురాలి డెడ్‌బాడీపై డ్యాన్స్‌చేసి సైకోలా ప్రవర్తించాడు. దీన్నంతా సెల్ఫీ వీడియో తీసి మృతురాలి బంధువులకే షేర్ చేశాడు. ఈ నెల 11న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్ జిల్లా మీర్‌పేటలో రాజస్థాన్‌కు చెందిన కమలాదేవి(60) కుటుంబంతో కలిసి స్థానికంగా హార్డ్వేర్షాప్ నడుపుతోంది. రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ బాలుడు(17)ని పనికి పెట్టుకుంది. షాప్‌పైన ఉన్న ఇంట్లోనే కమలాదేవి నివసిస్తున్నది. ఈ క్రమంలోనే రకరకాల పనుల కోసం బాలుడిని ప్రతిసారి ఆమె పైకి పిలిచేది. దీంతో విసిగిపోయిన బాలుడు కమలాదేవిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
రాడ్‌తో కొట్టి చంపి..
కమలాదేవి కుటుంబీకులు ఇటీవల రాజస్థాన్ వెళ్లగా.. ఆమె ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. ఇదే అదునుగా భావించిన బాలుడు.. ఈ నెల 11న రాత్రి వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లాడు. ఆమె తలపై ఇనుమ రాడ్‌తో బలంగా కొట్టి చంపేశాడు. తర్వాత డెడ్‌బాడీపై డ్యాన్స్ చేశాడు. అక్కడితో ఆగకుండా చీరతో ఆమెను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేయాలని ప్రయత్నించాడు. ఇదంతా రికార్డు చేసి, ఆ వీడియోను13న రాత్రి బెంగళూరులో ఉంటున్న మృతురాలి సోదరుడు ప్రకాశ్, అక్కడే ఉండే మరికొంత మంది బంధువులకు పంపించాడు. దీంతో వారు కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కుళ్లిపోయే స్థితిలో ఉన్న డెడ్‌బాడీని గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.