మహారాష్ట్రలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి, ప్రియుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. థానేలోని వాసింద్ పట్టణానికి చెందిన బాలికపై తండ్రి, ప్రియుడు గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తుండటంతో.. బాలిక గర్భందాల్చింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం నెలలు నిండని మృత శిశువుకు జన్మనిచ్చింది. బాలిక ఆ పిండాన్ని ఎవరూ లేని సమయంలో రోడ్డు పక్కన పడేసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా ఆ పిండం సదరు బాలికదేనని పోలీసులు గుర్తించారు. దాంతో ఆమెను విచారించగా.. ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయని అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ యోగేశ్ గురవ్ తెలిపారు.
ఇన్‌స్పెక్టర్ యోగేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘బాధితురాలి కుటుంబం గతంలో నవీ ముంబైలోని పన్వెల్ వద్ద నివసించేవారు. అక్కడ పొరుగింటి అబ్బాయితో బాధితురాలికి పరిచయం ఏర్పడి.. క్రమంగా అది వారిద్దరి మధ్య ఎఫైర్‌కి దారితీసింది. ఆ విషయం తెలిసిన బాధితురాలి కుటుంబం వారిద్దరినీ మందలించి.. అక్కడి నుంచి వాసింద్‌కు తమ మకాం మార్చారు. అయినా కూడా బాధితురాలు.. తన ప్రియుడిని కలుస్తూ తమ సంబంధాన్ని కొనసాగించేవారు’అని ఆయన తెలిపారు.
బాలిక చెప్పిన వివరాల ఆధారంగా.. ఉపాధ్యాయుడైన బాలిక తండ్రి మరియు ఆమె ప్రియుడిని సోమవారం ఉదయం అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ యోగేశ్ తెలిపారు. అత్యాచారం కింద సెక్షన్ 376 మరియు పిల్లలపై లైంగిక నేరాల కింద పోక్సో చట్టం కేసు నిందితులపై నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. తదుపరి దర్యాప్తులో భాగంగా నిందితులకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.