బుర్కినాఫాసోలో 170 మంది హత్య

  •      మూడు గ్రామాలపై దుండగుల దాడులు

ఔగడౌగౌ(బుర్కినా ఫాసో) : వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న బర్కినా ఫాసోలోని మూడు గ్రామాలపై దుండగులు దాడి చేశారు. చిన్నా పెద్ద తేడా చూడకుండా మారణహోమం సృష్టించారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో మొత్తం 170 మంది చనిపోయారు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ దాడి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని రీజినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలీ బెంజమిన్ ప్రకటించారు. యటెంగా ప్రావిన్స్‌‌‌‌లోని కొమ్సిల్గా, నోడిన్, సోరో గ్రామాలపై దాడి జరిగినట్టు తనకు నివేదిక అందిందని చెప్పారు.

 దాడిలో పలువురు గాయపడ్డారని, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని వివరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. దాడికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా అధికారులకు తెలియజేసి సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడికి సరిగ్గా వారం కింద నార్త్  బుర్కినాఫాసోలోని ఓ మసీదుతో పాటు మరో చర్చిపై దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనేది ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. దీనికి ప్రతీకారంగానే మూడు గ్రామాలపై దాడులకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. 

అయితే, వీటిని భద్రతా బలగాలు ఖండిస్తున్నాయి. చర్చి, మసీదుపై దాడులకు, మూడు గ్రామాలపై జరిగిన అటాక్​కు ఎలాంటి సంబంధంలేదని అంటున్నాయి. బుర్కినాఫాసో.. జిహాదిస్ట్ రెబల్ గ్రూప్ కంట్రోల్​లో ఉంది. ఈ దేశానికి నార్త్​లో మాలి అనే చిన్న దేశం ఉంది. ఇక్కడున్న అల్​ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో కలిసి జిహాదిస్ట్ రెబల్ గ్రూప్ పనిచేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో బర్కినాఫాసోలో 20వేల మంది చనిపోయారు. 20లక్షల మంది నిరాశ్రయులయ్యారు.