- భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తెగిన 172 చెరువులు
- పడావులో 50 వేల ఎకరాలు
- వ్యవసాయ భూముల్లో పేరుకుపోయిన ఇసుక, ఒండ్రు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి, ములుగు జిల్లాలు గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి. జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడినా మిగిలిన అన్ని చెరువులు నిండాలన్న ఉద్దేశంతో కాకతీయ రాజులు ఈ చెరువులను తవ్వించారు. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు తెగడంతో వేలాది ఎకరాల పంట భూముల్లో ఇసుక, ఒండ్రు పేరుకుపోయింది. దీంతో ఆ భూములన్నీ పడావు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెగిన 172 చెరువులు.. 41,602 ఎకరాల్లో పంట నష్టం
భారీ వర్షాలకు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆపార నష్టం జరిగింది. వరదల తాకిడికి భూపాలపల్లి జిల్లాలో 162, ములుగు జిల్లాలో 10 చెరువులు తెగాయి. దీంతో 41,602 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఒకే సారి పెద్ద సంఖ్యలో చెరువులు తెగడం వల్ల మోరంచవాగు, జంపన్నవాగులో వరద ఉధృతి పెరిగి మోరంచపల్లి, కొండాయి గ్రామాలు నీట మునిగాయి. దీంతో 20 మంది చనిపోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
భూపాలపల్లి జిల్లాలో 15,690 ఎకరాల్లో వరి, 15,381 ఎకరాల్లో పత్తి, 2,500 ఎకరాల్లో మిర్చి, మరో 264 ఎకరాల్లో ఇతర పంటలు కలిపి మొత్తం 33,835 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ములుగు జిల్లాలో 3,135 ఎకరాల్లో వరి, 3,020 ఎకరాల్లో పత్తి, 124 ఎకరాల్లో మిర్చితో పాటు మరో 1,488 ఎకరాల్లో ఇతర పంటలు కలిపి మొత్తం 7,767 ఎకరానల్లో నష్టం జరిగింది. అలాగే రెండు జిల్లాలో భారీ ఎత్తున ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి.
50 వేల ఎకరాలు పడావే..
రెండు జిల్లాల్లో తెగిపోయిన చెరువులను ఇప్పటికిప్పుడు బాగు చెయ్యడం సాధ్యమయ్యే పని కాదని ఇరిగేషన్ ఆఫీసర్లు అంటున్నారు. వీటిని ఊర్తి పూర్తి స్థాయిలో రిపేర్లు చేయాలంటే సుమారు రూ.100 కోట్లకు పైగా ఖర్చవుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి టెండర్లు పిలిచి, వర్క్‌లు చేసే నాటికి వానాకాలం, యాసంగి సీజన్ దాటుతుందని, వచ్చే ఎండాకాలంలో చెరువులకు రిపేర్లు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆయా చెరువుల కింద సాగవుతున్న సుమారు 50 వేల ఎకరాల్లో వానాకాలం, యాసంగి సీజన్‌లో పంటలు సాగు చేసే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకున్న ఇసుక, ఒండ్రు
భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు, చలివాగు, మానేరు ప్రభావంతో రేగొండ, గణపురం, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్ మండలాల్లో సుమారు 8 వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. ములుగు జిల్లాలో జంపన్నవాగు, దయ్యాల వాగు తదితర వాగుల ప్రవాహం వల్ల గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు, తాడ్వాయి మండలాల్లో 5 వేల ఎకరాల్లో ఇసుక దిబ్బలు కన్పిస్తున్నాయి. ఈ ఇసుకను తొలగించేందుకు ఎకరానికి రూ. 20 వేలకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. పంట నష్టం, బోరుబావుల తవ్వకం తదితర ఖర్చులన్నీ కలిపి రైతులకు సుమారు రూ. 500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.
చేపలూ కొట్టుకుపోయినయ్
చెరువులు తెగడం వల్ల చేపలు కొట్టుకుపోయి మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు జిల్లాల్లో 172 చెరువులు తెగిపోగా, 2 వేలకు పైగా చెరువులు మత్తళ్లు పోశాయి. దీంతో చెరువుల్లోని చేపలన్నీ బయటకు వెళ్లిపోయాయి. రెండు జిల్లాల్లో కలిపి మత్స్యకారులకు సుమారు రూ.50 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.