
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో 1,784 మంది స్టూడెంట్లు కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. బుధవారం గర్ల్స్ హైస్కూల్లో నిర్వహించిని కార్యక్రమంలో 23 మంది స్టూడెంట్లకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి కంటి అద్దాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ బ్లైండ్ నెస్, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఐదవ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న స్టూడెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 1,784 మంది స్టూడెంట్లు కంటి సమస్యతో బాధ పడుతున్నట్లు గుర్తించామని, మొదటి విడతగా 361 మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
స్టూడెంట్లు ప్రణాళికబద్ధంగా చదివి ఎస్సెస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. స్కూళ్లలో సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ప్రత్యేక ఫండ్ నుంచి నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేటి దొడ్డి మండలంలో 25 ఎకరాల స్థలంలో రూ.200 కోట్లతో గురుకుల స్కూల్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇన్చార్జి డీఎంహెచ్వో సిద్దప్ప, డీఈవో అబ్దుల్ ఘని, హెచ్ఎం జహీరుద్దీన్ పాల్గొన్నారు.
చట్టసభల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి
చట్ట సభల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, మహిళలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.
అన్నిరంగాల్లో మహిళలు రాణించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, డీడబ్ల్యూవో సునంద పాల్గొన్నారు.