
- పరామర్శకు వెళ్లి.. ప్రమాదానికి గురైన గంగారం
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దుర్ఘటన
రాజన్న సిరిసిల్ల , వెలుగు: పరామర్శకు వెళ్లి ప్రమాదవశాత్తు లిప్ట్ లో పడి 17వ బెటలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్ధులం గ్రామానికి చెందిన గంగారాం(58) సిరిసిల్లలోని సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ లో కమాండెంట్ గా డ్యూటీ చేస్తున్నారు. ఇటీవల సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి బంధువొకరు మరణించగా.. పరామర్శించేందుకు గంగారాం మంగళవారం ఆయన వద్దకు వెళ్లారు.
డీఎస్పీతో మాట్లాడి తిరిగి వెళ్లేందుకు లిఫ్ట్ దగ్గర కొచ్చాడు. లిఫ్ట్ రెడీగా ఉందనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు వేసిన ఆయన మూడో ఫ్లోర్ నుంచి ఒకటో ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ పై పడ్డారు. విషయం తెలుసుకొని ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని గంట పాటు శ్రమించి తాళ్ల సాయంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన గంగారాంను ఆస్పత్రి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు.
గంగరాంకు భార్య రేఖ, కొడుకు సతీశ్‌కుమార్, ఇద్దరు కూతుళ్లు గౌతమి, మీనల్ ఉన్నారు. గంగారాం భౌతికకాయానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖరరెడ్డి, 1 వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, 3వ బెటాలియన్ కమాండెంట్ జమీల్ పాషా, 17వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, రాందాస్, బెటాలియన్ అధికారులు, సిబ్బంది నివాళి అర్పించారు.