- పదవుల కోసం కాంగ్రెస్ ఆశావహుల ప్రయత్నాలు
- త్వరలో కొత్త కమిటీల ఏర్పాటుకు సర్కారు కసరత్తు
- రిజర్వేషన్లపైనే అందరి దృష్టి
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల జాతర షురూ కానుంది. ఇప్పటికే పలు కమిటీలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఈ మధ్యే వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, బోథ్, జైనథ్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నిర్మల్, భైంసా, ఖానాపూర్, మంచిర్యాల, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, జైనూర్, సారంగాపూర్, కుభీర్, జన్నారం, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్ 18 మార్కెట్ కమిటీల పాలకవర్గాలు ఖాళీ అయ్యాయి.
కొత్తగా ఏర్పాటు చేసే కమిటీల్లో 18 మంది సభ్యులను నియమించనుండగా వీరిలో చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులను నియమించనున్నారు. 12 మంది సభ్యుల్లో ఇద్దరు వ్యాపారస్తులను భాగస్వాములుగా చేయనున్నారు. ఈ పాలకవర్గాల స్థానంలో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశతో ఉన్న లీడర్లకు ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవుల పండుగ మొదలయ్యే అవకాశాలున్నాయి.
పెరుగుతున్న ఆశావహులు
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే వారి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కార్పొరేషన్, ఎమ్మెల్సీ పదవులతో పాటు జిల్లాస్థాయిలో గ్రాంథాలయ, ఏఎంసీ వంటి పదవులపై కాంగ్రెస్ లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. వీటితోపాటు పార్టీ పదవులైన డీసీసీ చైర్మన్ పదవులను కొందరు ఆశిస్తున్నారు. నామినేటెడ్ పదవులను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారు.
ఇక నియోజకవర్గ స్థాయి నామినే టెడ్ పదవుల కోసం ఆయా మండలాలకు చెందిన లీడర్లు ప్రయత్నిస్తుండగా.. జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల కోసం నియోజకవర్గాల నుంచి సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో వలసల జోరు కొనసాగుతోంది. జడ్పీ చైర్మన్లు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు జడ్పీ టీసీ, ఇతర ప్రజాప్రతినిధులు ఈ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ALSO READ : డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్నామని, అధిష్ఠానం తమకు అవకాశం ఇస్తుందని కొందరు సీనియర్లు ఆశలు పెట్టుకోగా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరితే ఏదో ఓ పదవి దక్కుతుందనే ఆశతో కొత్తగా పార్టీలో చేరుతున్న వారూ ఉన్నారు. కొంత మంది పదవి ఒప్పందం కుదుర్చుకుని పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ పదవుల కోసం ఆశావహులు ఎమ్మెల్యేలతో టచ్ లోకి వస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్క ద్వారా కూడా మార్కెట్ కమిటీ పాలకవర్గాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ..
ప్రభుత్వం రద్దు చేసిన మార్కెట్ కమిటీల స్థానంలో కొత్త కమిటీలు వేసేందుకు ఇంకా రిజర్వేషన్లు ప్రకటించలేదు. అయితే గత ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగిస్తారా? లేక కొత్తగా రిజర్వేషన్లు ప్రకటిస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కష్టపడి పనిచేసిన లీడర్లకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. నామినేటెడ్ పదవుల్లో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని పార్టీకి ప్రయోజనం చేకూరేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవుల్లో మహిళలకు సైతం పెద్దఎత్తున అవకాశాలు కల్పించేందుకు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నామినేటెడ్ పదువుల నియామకాలతో పార్టీలో కాంగ్రెస్ మరింత ఊపు తీసుకొచ్చేందుక ప్రయత్నాలు చేస్తుంది. పదేండ్ల తర్వాత కాంగ్రెస్లో పదవుల జాతర మొదలు కానుండటంతో అవి ఎవరికి దక్కుతాయోనని పార్టీ వర్గాలతోపాటు జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.