అరేబియా సముద్రంలో.. 7 గంటల్లో 18 కిలోమీటర్ల స్విమ్మింగ్​

అరేబియా సముద్రంలో.. 7 గంటల్లో 18 కిలోమీటర్ల స్విమ్మింగ్​

బషీర్ బాగ్, వెలుగు: అరేబియా సముద్రంలో ఏడు గంటల్లో 18కిలోమీటర్ల స్విమ్మింగ్  పూర్తిచేసి హైదరాబాద్ కు చెందిన తల్లికొడుకులు సరికొత్త రికార్డు సృష్టించారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ లో గంధం క్వీనీ విక్టోరియా, ఆమె కుమారుడు స్టీఫెన్ కుమార్ పాల్గొన్నారు. 

తల్లికొడుకులిద్దరూ మాండ్వా జెట్ నుంచి ముంబై గేట్ వే ఆఫ్​ ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేశారు. అరేబియా మహాసముద్రం మాండ్వా జెట్ వద్ద ఉదయం 7.36 గంటలకు ఈ ఇద్దరు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ప్రారంభించారు. సుమారు 7 గంటలు ఏకధాటిగా ఈది మధ్యాహ్నం 2.37 గంటలకు ముంబై  గేట్​వే ఆఫ్ ఇండియాకు చేరుకున్నారు. 

అరేబియా సముద్రంలో18 కిలో మీటర్ల దూరాన్ని ఈ ఇద్దరు ఏడు గంటల ఒక్క నిమిషంలో పూర్తి చేశారు. మహారాష్ట్ర అమెచ్యూర్, అక్వాటిక్ అసోసియేషన్ అబ్జర్వర్ శైలేశ్ సింగ్, పైలట్ గైడ్ సుబుద్ సులే దీనిని పర్యవేక్షించారు. తల్లికొడుకు కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారి. ఈ సందర్భంగా క్వీనీ విక్టోరియా మాట్లాడారు. సప్త సముద్రాలను తన కూమారుడితో  కలిసి ఈదడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రికార్డును హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు అంకితమిస్తున్నట్టు వివరించారు.