
కర్నూలు: భార్యా భర్తల మధ్య కలహాలు… అనుమానాలతో మనుషులు మృగాలుగా తయారవుతున్నారు. కలహాలను తీర్చే పెద్దలు కరువై.. ఒక వేళ ఉన్నా వారిని లెక్క చేయని అలవాట్లతో చేతులారా జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. బోసినవ్వులతో మనసారా నవ్వించే చిన్నారి పట్ల ఏ తండ్రి చేయనివిధంగా ప్రవర్తించాడో మృగాడు. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం చింతమానుపల్లె గ్రామంలో జరిగిన ఘటన క్షీణిస్తున్న మానవ సంబంధాలకు తాజా నిదర్శనంగా నిలిచింది. కలహాల కాపురాలతో సతమతమవుతున్న వారిని సర్దుబాటు చేసి కాపురాలు సజావుగా జరిగేలా చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.
చింతమానుపల్లెకు చెందిన నాగేశ్వరరెడ్డి కి సమీప గ్రామానికి చెందిన సరితతో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి కుమారుడు ఐదేళ్లు.. రెండో వాడు ఏడాదిన్నర వయసున్న సందీప్ రెడ్డి (18 నెలలు). కొంత కాలంగా నాగేశ్వరరెడ్డికి తన భార్య సరిత తాను లేని సమయంలో ఎవరితోనో చనువుగా ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనుమానంతో రగిలిపోయాడు. అనుమానం పెనుభూతమైంది. నిన్న అర్ధరాత్రి భార్య పక్కన నిద్రిస్తున్న పసికందు నోరు నొక్కేసి.. కూరగాయల కత్తితో గొంతు కోసి చంపేశాడు. కొద్దిసేపటి తర్వాత భార్య తన చిన్నకొడుకులో కదలికలేనిది గుర్తించి లేచి చూస్తే.. బుజ్జాయి సందీప్ రెడ్డిని గొంతు కోసి చంపేసినట్లు చూసి షాక్ కు గురైంది. బోరున విలపించింది. పక్కనే ఉండి నిద్ర నటిస్తున్న భర్త నాగేశ్వరరెడ్డి లేచి.. ఎవరో తన కుమారుడిని చంపేశాడని చిత్రీకరించే ప్రయత్నం చేసినా తడబాటును చూసి భార్య సరిత గుర్తుపట్టింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా కన్న తండ్రి నాగేశ్వరరెడ్డి నేరం అంగీకరించాడు.